
బెంగళూరు : సుల్తాన్ ఉత్సవాలు జరపడానికి వారి దగ్గర డబ్బులుంటాయి కానీ హంపి చరిత్రను గుర్తు చేసుకోవడానికి మాత్రం డబ్బు ఖర్చు చేయలేరని ప్రధాని నరేంద్ర మోదీ.. కుమారస్వామి ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. కర్ణాటక ప్రభుత్వం ప్రతి ఏడాది నవంబర్ 10న టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటక వెళ్లిన నరేంద్ర మోదీ కాంగ్రెస్ జేడీఎస్ కూటమిపై విమర్శల వర్షం కురిపించారు. ప్రస్తుతం కర్ణాటకలో ఉన్నది 20 శాతం ప్రభుత్వమని.. దాని ప్రధాన ఉద్దేశం కమిషన్‌లు సేకరించడమేనని ఆరోపించారు.
కర్ణాటకలో రాచరికం, అవినీతి ప్రభుత్వాలు రాజ్యమేలుతున్నాయని విమర్శించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మోదీ హవా నడుస్తుందని.. ప్రజలంతా బీజేపీ పాలన రావాలని కోరుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు జాతీయవాదులకు, రాచరికానికి మధ్య జరుగుతున్నాయని పేర్కొన్నారు. గతంలో కుమారస్వామి సైన్యాన్ని ఉద్దేశిస్తూ.. రోజుకు రెండు పూటలా భోజన దొరకని వారే.. ఆర్మీలో చేరతాని కామెంట్ చేశారు. దీనిపై స్పందించిన మోదీ దేశ భద్రత కోసం ప్రాణాలర్పించే వారి పట్ల ఇంత చులకన భావం ఉన్నవారు.. ప్రజలకు ఎలాంటి భద్రత కల్పిస్తారని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment