న్యూఢిల్లీ : పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) పై ఈశాన్య ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలో నిరసనలు తలెత్తిన ప్రాంతంలో చర్యలు తీసుకువడంపై అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు కేజ్రీవాల్ పేర్కొన్నారు. నిరసన జరిగిన ప్రాంతానికి పోలీసులను పంపనున్నట్లు అమిత్ షా హామీ ఇచ్చారని కేజ్రీవాల్ వెల్లడించారు. దీంతో పాటు ఈశాన్య ఢిల్లీలో శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు అన్ని పార్టీలు తమ సంసిద్ధతను వ్యక్తం చేశాయని కేజ్రీవాల్ తెలిపారు.
అంతకుముందు ఈశాన్య ఢిల్లీ ఎమ్మెల్యేలతో సమావేశం తర్వాత కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఈశాన్య ఢిల్లీలో చోటుచేసుకున్న అల్లర్లలో మృతుల సంఖ్య ఏడుకు చేరడం బాధాకరమని పేర్కొన్నారు. నిరసనల్లో భాగంగా పలు ఇళ్లకు, దుకాణాలకు నిప్పు పెట్టి ఆస్తి నష్టం కలిగించడం దురదృష్టకరమని తెలిపారు. ఢిల్లీలో పోలీసుల కొరత తీవ్రంగా ఉందని, పైనుంచి ఆదేశాలు వచ్చే వరకు అల్లర్లు చోటుచేసుకున్న ప్రాంతంలో చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.దాడిలో చనిపోయిన కానిస్టేబుల్‌తో పాటు మరణించిన మిగతావారు కూడా ఢిల్లీకి చెందిన పౌరులని, వారంతా తమవారని కేజ్రీవాల్ తెలిపారు.
(చదవండి : పాకిస్తాన్ జిందాబాద్; ‘కాల్చి పారెయ్యండి’)
ఎమ్మెల్యేలతో సమావేశంలో కొన్ని విషయాలు తన దృష్టికి వచ్చాయని కేజ్రీవాల్ పేర్కొన్నారు. అల్లర్లు చోటుచేసుకున్న ప్రాంతానికి వేరే ప్రాంతం నుంచి కొంతమంది చొరబడుతున్నట్లు తెలిసిందన్నారు. వెంటనే సరిహద్దులను మూసేసి , వారిని ముందస్తు అరెస్టు చేయాలని తాను సూచించినట్లు తెలిపారు. దీంతో పాటు ఆందోళనలో తీవ్రంగా గాయపడినవారికి ఉత్తమమైన వైద్యం అందించేందుకు వైద్యులు సిద్ధంగా ఉండాలని ఆదేశించినట్లు తెలిపారు. కాగా పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) మద్దతుగా కొందరు, వ్యతిరేకంగా మరికొందరు విడిపోయి పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో హింసాత్మకంగా మారింది.
(‘వెనక్కి వెళ్లిపో లేదంటే.. కాల్చిపడేస్తా!’)
Comments
Please login to add a commentAdd a comment