
బీజేపీలో ఢిల్లీ సీఎం పదవిని చేపట్టగల సమర్ధ నేత లేడని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీలో ఢిల్లీ సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టే స్ధాయి గల నేత ఎవరూ లేరని ఆప్ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఫిబ్రవరి 8న జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరిరోజైన గురువారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరో ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారని, మీ పార్టీ నుంచి సంబిట్ పాత్రా లేక అనురాగ్ ఠాకూర్‌ను సీఎం అభ్యర్థిగా ప్రతిపాదిస్తారా అని కేజ్రీవాల్ కాషాయ పార్టీని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను మతపరంగా విడదీసేందుకు బీజేపీ ప్రయత్నించిందని, ఆ ప్రయత్నంలో బీజేపీ విజయవంతమైందా లేదా అనేది ఫలితాలు వెల్లడిస్తాయన్నారు.
ఆప్ ఓటర్లు మెరుగైన విద్య, వైద్యం, ఆధునిక రహదారులు, 24 గంటల విద్యుత్‌ను కోరుకుంటున్నారని అన్నారు. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే షహీన్‌బాగ్‌లో సీఏఏ వ్యతిరేక నిరసనలపై బీజేపీ మౌనం దాల్చిందని ఆరోపించారు. షహీన్‌బాగ్ రోడ్‌ను క్లియర్ చేయడంలో హోంమంత్రి అమిత్‌షాకు ఏం అడ్డంకి ఎదురైందని కేజ్రీవాల్ ప్రశ్నించారు. ఆ రహదారిని బ్లాక్ చేయడం వల్ల ఆయనకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుంది..ఢిల్లీ ప్రజలకు ఎందుకు ఇబ్బందులు కలిగించారు..నిరసనలపై దిగజారుడు రాజకీయాలను ఎందుకు చేస్తున్నారంటూ ఆయన బీజేపీని నిలదీశారు. ఢిల్లీలో అనధికార కాలనీల సమస్యలను పూర్తిగా విస్మరించిన బీజేపీ నేతలు ఎన్నికల నేపథ్యంలో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఆప్ తిరిగి అధికారంలోకి వస్తే ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన ఉచిత పథకాలు కొనసాగుతాయని, అవసరమైతే ఇలాంటి పథకాలను మరికొన్ని చేపడతామని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు.