శిష్యునిపై గురువు సీరియస్..
ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఆయన గురువు, అవినీతి వ్యతిరేక ఉద్యమ నాయకుడు అన్నా హజారే తప్పుబట్టారు. ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్‌లను ఉపయోగించాలని ఎన్నికల సంఘాన్ని కేజ్రీవాల్ కోరడంపై హజారే తీవ్రంగా స్పందించారు. ప్రపంచమంతా టెక్నాలజీలో ముందుకు వెళ్తుంటే.. ఇంకా స్కూల్ బ్యాలెట్ పేపర్ పద్ధతిని వాడాలని సూచించడం సరికాదని కేజ్రీవాల్‌ను మందలించారు. 2011 హజారే సారథ్యంలో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కేజ్రీవాల్ ఆయన శిష్యుడిగా కీలకపాత్ర పోషించారు. యూపీఏ ప్రభుత్వంలో అవినీతి నిరోధక చట్టం తీసుకురావాలని విద్యార్థులు, యువతతో దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు. కేజ్రీవాల్ రాజకీయ పార్టీ పెట్టాలన్న ఆలోచనను హజారే వ్యతిరేకించారు. కానీ ఢిల్లీ సీఎం మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించారు.
ఈవీఎం ట్యాంపరింగ్ కాంగ్రెస్‌కు మేలు..
పంజాబ్ ఎన్నికల్లో ఈవీఎంల ట్యాపరింగ్ జరగడంతో కాంగ్రెస్ కు మేలు జరిగిందని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. కాంగ్రెసేతర ఓట్లు ట్యాంపరింగ్‌తో బీజేపీ-అకాలీదళ్‌కు వెళ్లాయని ఆరోపించారు. దీంతో ఆప్‌కు తక్కువ సీట్లు వచ్చాయని, కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుచుకుందని తెలిపారు. అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్, ఆప్‌లు సమానంగా సీట్లు గెలుచుకుంటాయని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. కాగా కేజ్రీవాల్ ఆరోపణల పై బీజేపీ నాయకులు ఆయనకు మతిభ్రమించిందని తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.