జాతీయగీతంపై నటుడి కీలక ప్రశ్న | Arvind swami questioned about National Anthem | Sakshi
Sakshi News home page

జాతీయగీతంపై నటుడి కీలక ప్రశ్న

Published Tue, Oct 24 2017 9:45 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

Arvind swami questioned about National Anthem - Sakshi

చెన్నై: సినిమా హాళ్లలో జాతీయగీతం ప్రదర్శితమవుతున్న సమయంలో ప్రేక్షకులు తమ దేశభక్తిని నిరూపించుకునేందుకు కచ్చితంగా లేచి నిలబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం తెలిసిందే. సినిమా హాలులో జాతీయగీతం వస్తున్నప్పుడు లేచి నిలబడని వారికి దేశ భక్తి తక్కువ ఉందని అనుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఈ వివాదాస్పద అంశంపై స్పందించిన నటుడు అరవిందస్వామి సోషల్ మీడియా ద్వారా కొన్ని విలువైన ప్రశ్నలు సంధించారు. 'జాతీయ గీతం వినిపించినప్పుడు నేను లేచి నిలబడి ఆ గీతాన్ని ఆలపిస్తాను. దీన్ని చాలా గౌరవంగా భావిస్తాను. అయితే ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు, అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యే ముందు ప్రతిరోజూ జాతీయగీతాన్ని ఎందుకు ఆలపించరని' ట్వీట్ ద్వారా నటుడు ప్రశ్నించారు.

అలాంటి కీలక ప్రదేశాలు, కార్యాలయాల్లో పాటించని జాతీయగీతం ప్రదర్శనను.. కేవలం థియేటర్లలోనే ఎందుకు తప్పనిసరి చేశారో అర్థం కావడం లేదంటూ మరో ట్వీట్ చేశారు. మరోవైపు దేశ భక్తిని భుజాలపై మోయాల్సిందిగా ప్రజలను ఎవరూ బలవంతపెట్టలేరని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. సినిమా షోకు ముందు జాతీయగీతం ప్రసారానికి సంబంధించిన నిబంధనలను సవరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం కేంద్రానికి సూచించింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ నటుడికి మంచి గుర్తింపు ఉంది. ఇటీవల రాంచరణ్ నటించిన ధృవ మూవీలో స్ట్రాంగ్‌ విలన్ రోల్‌ పోషించి తెలుగు ప్రేక్షకులను మరోసారి మెప్పించారు అరవిందస్వామి.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement