
ములాయం నాకు భయపడ్డారు: ఒవైసీ
ఫైజాబాద్: సమాజ్‌వాద్ పార్టీ నేత ములాయం సింగ్, యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్‌లపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రమైన విమర్శలు చేశారు. వీరిద్దరూ.. ప్రధాని నరేంద్ర మోదీతో కుమ్మక్కై.. సమాజ్‌వాదీ పార్టీలోని ముస్లిం నాయకులను మాట్లాడనీయటం లేదన్నారు. తనను చూసి ములాయం, అఖిలేశ్ భయపడ్డారని.. అందుకే మూడున్నరేళ్లుగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో కాలుపెట్టకుండా అడ్డుకుంటున్నారని ఒవైసీ విమర్శించారు.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం సృష్టించేందుకు అణగారిన వర్గాలైన ముస్లింలు, దళితులను ‘జై భీం, జై మీం’ నినాదంతో ఏకం చేస్తామన్నారు. బికాపూర్ అసెంబ్లీ స్థానానికి ఫిబ్రవరి 13న జరగనున్న ఉప ఎన్నికల్లో ఎంఐఎం తరఫున ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు.