ఆశిష్ సింగ్ అషు
లక్నో: నియోజకవర్గ ప్రజలను కాపాడాల్సింది పోయి.. తానే వారి పాలిట కాలయముడిగా మారాడు. సాయం కోసం వచ్చిన బాలికపై అత్యాచారం చేశాడు. పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు ఆమె తండ్రిని చంపేశాడు. చివరికి బాధితురాలిని కూడా చంపేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ చేయించడంతో.. ప్రసుత్తం ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఉన్నావ్ అత్యాచార బాధితురాలి యాక్సిడెంట్ పట్ల దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతుంటే.. నాయకులు మాత్రం ఇంకా కళ్లు తెరవడం లేదు. నిందితుల తరఫున వకాల్తా పుచ్చుకుని అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన బీజేపీ నాయకుడు ఆశిష్ సింగ్ అషు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉన్నావ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆశిష్ సింగ్ మాట్లాడుతూ.. ‘మన సోదరుడు కుల్దీప్ సింగ్ నేడు మన మధ్యలో లేకపోవడం బాధాకరం. ప్రస్తుతం కుల్దీప్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ సమయంలో మనం అన్నకు తోడుగా ఉండాలి. త్వరలోనే కుల్దీప్ ఈ కష్టాల నుంచి బయటపడతారని ఆశిస్తున్నాను. మనం ఎక్కడ ఉన్నా కుల్దీప్ క్షేమం గురించి ఆలోచించాలి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఆశిష్ వ్యాఖ్యల పట్ల ప్రతిపక్షాలతో పాటు మహిళా సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
‘ఆడపిల్లకు అన్యాయం చేసి చంపడానికి చూసిన వాడిని వెనకేసుకు వస్తున్నారు. మీలాంటి నాయకుల ఉండటం మా ఖర్మ’ అంటూ జనాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురికావడంతో ప్రతిపక్షాలు పార్లమెంట్‌లో బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. దీంతో బీజేపీ కుల్దీప్‌పై చర్యలకు సిద్ధపడింది. అతడిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు బీజేపీ అధిష్టానం గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment