
గువాహటి : అస్సాంలో మరో లక్ష మందిని జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ) ముసాయిదా నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికారుల నిర్లక్ష్యం మూలానా ఓ భారతీయురాలు మీద.. విదేశీయురాలు అనే ముద్ర పడింది. ఫలితంగా గత మూడేళ్ల నుంచి ఆ మహిళ నిర్భందంలో గడపింది. చివరకు బుధవారం సాయంత్రం విడుదల అయ్యింది.
వివరాలు.. అస్సాం బోర్డర్ పోలీసులు రాష్ట్రంలో అక్రమంగా ప్రవేశించిన విదేశీయులను గుర్తించి వారిని నిర్భందంలోకి తీసుకుంటారు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం చిరాంగ్ జిల్లా బిష్టుపూర్ గ్రామానికి చెందిన మధుబాల దాస్ అనే విదేశీయురాలిని నిర్భందంలోకి తీసుకోవాల్సి ఉంది. కానీ ఆమె అప్పటికే మరణించడంతో అధికారులు మధుబాల మొండల్(59)ను నిర్భందంలోకి తీసుకున్నారు. జరుగుతున్న పరిణామాల గురించి ఆమెకు ఏ మాత్రం అవగాహన లేదు. నిరక్ష్యరాస్యురాలు కావడంతో మొండల్ అధికారులను ఎదిరించలేకపోయింది.
మధుబాల మొండల్‌కు సాయం చేయడానికి ఆమెకంటూ ఎవరూ లేరు. భర్త కొన్నేళ్ల క్రితమే మరణించాడు. ఆమెకు ఓ మూగ, చెవిటి కూమార్తె ఉంది. పెళ్లైన ఆమెను భర్త వదిలిపెట్టడంతో కుమార్తె బాధ్యతలు కూడా మొండల్‌పైనే పడ్డాయి. కుటుంబానికి ఆమె జీవనాధారం. ఈ క్రమంలో ఓ రోజు అస్సాం బార్డర్ పోలీసులు ఆమెను విదేశీయిరాలు అంటూ కొక్రాఝర్ నిర్భంద కేంద్రానికి తరలించారు. విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్తలు మధుబాల మొండల్‌కు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. అధికారుల నిర్లక్ష్యాన్ని అస్సాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వారి కృషి ఫలితంగా మూడేళ్ల నిర్భందం తర్వాత బుధవారం సాయంత్రం మధుబాలను విడిచిపెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment