సాక్షి, న్యూఢిల్లీ : అస్సాంకు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక మహిళ స్యాదా అన్వర తైమూర్‌కు ఇటీవల ఎన్‌ఆర్‌సీ విడుదల చేసిన పౌరసత్వ జాబితాలో చోటు లభించలేదు. భారత ఐదవ రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సమీప బంధువులకు కూడా చోటు లభించని విషయం తెల్సిందే. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో నివసిస్తున్న తైమూర్ కుటుంబం ఎన్‌ఆర్‌సీలో తమ పేర్లను నమోదు చేసుకోవడానికి త్వరలో భారత్‌కు రానున్న తెలిపింది. ఎన్‌ఆర్‌సీలో తమ పేర్లను నమోదు చేయించాల్సిందిగా అస్సాంలో ఉన్న తమ బంధువులకు చెప్పామని, అయితే కొన్ని కారణాల వల్ల అది సాధ్యం కాలేదని ఆస్ట్రేలియా నుంచి తైమూర్ కుమారుడు మీడియాకు ఫోన్ ద్వారా తెలిపారు.
తైమూర్ 1980, డిసెంబర్ ఆరవ తేదీ నుంచి 1981, జూన్ 30 వరకు అస్సాం ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆమెకు ముందుగానీ వెనకగానీ సీఎం పదవిని చేపట్టిన మహిళలు లేరు. ఆమె 1988లో రాజ్యసభ సభ్యురాలుగా కూడా ఉన్నారు. చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తైమూర్ 2011లో ఆ పార్టీని వదిలిపెట్టి అఖిల భారత ఐక్య ప్రజాస్వామ్య సంఘటన (ఏఐయూడీఎఫ్)లో చేరారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక మహిళ పేరు కూడా పౌరసత్వ జాబితాలో లేకపోవడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని ఏఐయూడీఎఫ్ ప్రధాన కార్యదర్శి అమినల్ ఇస్లాం వ్యాఖ్యానించారు.
జాబితా పునర్ పరిశీలన సందర్భంగా పౌరసత్వం తీసుకునే అవకాశం సరైన డాక్యుమెంట్లు ఉన్న వారందరికి లభిస్తుందని రిజిస్టర్ రాష్ట్ర కోఆర్డినేటర్ ప్రతీక్ హజేలా తెలిపారు. తైమూర్ కుటుంబానికి సంబంధించిన సమాచారం తమ వద్ద లేకపోవడం వల్ల రిజిస్టర్‌లో ఆ కుటుంబానికి చోటు లభించలేదని, ఆ కుటుంబం దరఖాస్తు చేసుకున్నా లభించేదని అన్నారు. ఇప్పటికైనా నష్టమేమీ లేదని, ఫిర్యాదుల సందర్భంగా వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. పౌరసత్వ రిజిస్టర్‌లో ఇలా చాలా పేర్లు గల్లంతయ్యాయని తెలిసి, వాటిని సరిదిద్దేందుకు ఆగస్టు నాటికి సరైన ప్రమాణాలను ఖరారు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు కూడా ఎన్‌ఆర్‌సీని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment