రోదిస్తున్న సామ్ బంధువులు( ఫొటో కర్టెసీ: పీటీఐ)
గువాహటి/అసోం: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వ్యక్తమవుతున్న నిరసనల్లో సామ్ స్టాఫర్‌్డ అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. సంగీతాన్ని ప్రాణంగా భావించే అతడు.. తూటాల దాహానికి బలయ్యాడు. పౌరసత్వ చట్టానికి నిరసనగా ఆందోళనలు ఉధృతమైన నేపథ్యంలో సామ్ మరణం నిరసనకారుల ఆవేదనను రెట్టింపు చేసింది. ‘నీవు అమరుడివయ్యావు. నీకు వందనం. జై అసోం’ అంటూ అశ్రునయనాలతో అతడికి శాశ్వత వీడ్కోలు పలికారు. ఇక బాధితుడి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటన అసోంలో శుక్రవారం చోటుచేసుకుంది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. మేఘాలయకు చెందిన ప్రముఖ గాయకుడు జుబీన్ గార్గ్ సైతం ఆందోళనకారులకు మద్దతు తెలుపుతూ సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇందులో భాగంగా శుక్రవారం సాయంత్రం అసోంలోని నామ్‌గఢ్ ప్రాంతంలో నిరసనకారులకు సంఘీభావం తెలిపేందుకు ఓ కన్సర్ట్ ఏర్పాటు చేశాడు. అప్పటి వరకు మైదానంలో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సామ్.. ఈ విషయం తెలుసుకుని అక్కడికి పరిగెత్తాడు.
ఈ క్రమంలో అక్కడ నిలిపి ఉన్న కారులో నుంచి గుర్తు తెలియని దుండగులు సామ్‌పై కాల్పులకు తెగబడి.. అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో స్థానికులు అతడిని ఆస్పత్రిలో చేర్పించగా.. అప్పటికే సామ్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే నిరసనకారులు మాత్రం ఇది పోలీసుల పనే అని ఆరోపిస్తున్నారు. ఈ విషయం గురించి సామ్ అక్క మౌసుమీ బేగం మాట్లాడుతూ... ‘ నా తమ్ముడు అమాయకపు పిల్లాడు. నిజానికి వాడికి పౌరసత్వ సవరణ చట్టం గురించి పూర్తిగా తెలియదు. సంగీతం అంటే వాడికి ఆసక్తి. డ్రమ్మర్‌గా ఎదగాలనేది వాడి ఆశయం. అందుకే జుబిన్ వస్తున్నాడని తెలియగానే అక్కడికి పరిగెత్తాడు. గుర్తు తెలియని దుండగుల తూటాలకు బలయ్యాడు. ఇది మాకు జీవితకాలపు విషాదం. టూటూ(సామ్ ముద్దుపేరు)కి ఫోన్ చేయగానే డాక్టర్ ఫోన్ ఎత్తి.. సామ్ పరిస్థితి విషమంగా ఉందని చెప్పాడు. వెంటనే అక్కడికి పరిగెత్తుకువెళ్లాం. కానీ అప్పటికే వాడు చచ్చిపోయాడు’ అంటూ బోరున విలపించింది.
ఇక సామ్ తల్లిదండ్రులు సైతం ఒక్కగానొక్క కుమారుడు మరణించడంతో కన్నీరుమున్నీరవుతున్నారు. కాగా సామ్ అంత్యక్రియలకు పెద్ద ఎత్తున నిరసనకారులు, లాయర్లు, విద్యార్థి నాయకులు హాజరయ్యారు. సూర్యాస్తమయం తర్వాత అరాచక శక్తులు రెచ్చిపోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. ఇక ఈ ఘటనపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు... లోతుగా విచారణ జరిపి నిందితులను అరెస్టు చేస్తామని పేర్కొన్నారు. సామ్ మరణంతో అల్లర్లు చెలరేగే అవకాశం ఉన్న నేపథ్యంలో నామ్‌గఢ్ వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. కాగా వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూడు పొరుగు దేశాలైన.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మతపరమైన వేధింపులు ఎదుర్కొని భారత్‌కు వచ్చిన ముస్లిమేతరులకు భారత పౌరసత్వం కల్పించే వీలు కలుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment