'తాలిబన్ సంస్కృతిగా మార్చకండి'
న్యూఢిల్లీ: 'కన్హయ్య నిందితుడు. మీకు అతడికి జీవిత కారాగార శిక్ష విధించాలని ఉంటే విధించండి. కుమార్ తలరాత నిర్ణయించాల్సింది న్యాయస్థానం. మా విద్యార్థి సంస్కృతిని తాలిబన్ సంస్కృతిగా మార్చకండి' అని నర్వాల్ అనే ఏబీవీపీ విద్యార్ధి నాయకుడు అన్నారు. జేఎన్యూలో కన్హయ్య కుమార్ అరెస్టు వివాదం, రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరు, పోలీసుల స్పందన తమను కలిచి వేసిందంటూ బీజేపీకి చెందిన విద్యార్థి విభాగం అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)కు చెందిన ముగ్గురు విద్యార్థి నాయకులు రాజీనామా చేశారు.
'జేఎన్యూకు చెందిన ముగ్గురు ఏబీవీపీ నాయకులు కేంద్రంపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ రాజీనామా చేశారు' అని పీటీఐ వార్తా సంస్థ గురువారం ఉదయం వెల్లడించింది. వారు ఒక లేఖను ఈ సందర్భంగా విడుదల చేసినట్లు పేర్కొంది. విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు చూస్తూ కూడా ప్రభుత్వానికి మద్దతుగా ఉండలేమంటూ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అధ్యక్షుడు రాహుల్ యాదవ్, కార్యదర్శి అంకిత్ హన్స్, మరో కార్యదర్శి ప్రదీప్ నావల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న జేఎన్యూ వివాదం, మనుస్మృతిపై చాలా కాలంగా బీజేపీకి ఉన్న అభిప్రాయం, రోహిత్ వేముల ఆత్మహత్య ఘటన విషయంలో కేంద్రం తీరుపై అభిప్రాయ భేదాలు రావడంతోపాటు పోలీసుల చర్యలు కూడా తమను ఇబ్బందికి గురిచేశాయని, విద్యార్థుల మధ్య చీలికలు తెచ్చేలా ఉన్నాయని వారు పేర్కొన్నారు. దీంతోపాటు దేశానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేయడాన్ని తాము కూడా వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. అయితే, తమకు ఇప్పటి వరకు ఎలాంటి రాజీనామా లేఖలు అందలేదని ఏబీవీటీ ఉన్నత శ్రేణి నేతలు అన్నారు.