
గంగానదిలో వాజ్‌పేయి అస్థికల్ని నిమజ్జనం చేస్తున్న దత్త పుత్రిక నమితా భట్టాచార్య, రంజన్ భట్టాచార్య. చిత్రంలో అమిత్ షా, యూపీ సీఎం యోగి, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ తదితరులు
హరిద్వార్ / లక్నో: దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి అస్థికలను ఆదివారం హరిద్వార్‌లోని హర్‌కీ పౌడీ ప్రాంతంలోని గంగానదిలో నిమజ్జనం చేశారు. వాజ్‌పేయి దత్త పుత్రిక నమితా భట్టాచార్య, అల్లుడు రంజన్ భట్టాచార్యలు వేదమంత్రోచ్ఛారణల నడుమ ఈ క్రతువును పూర్తిచేశారు. తొలుత బీజేపీ చీఫ్ అమిత్ షా వాజ్‌పేయి అస్థికలతో ప్రత్యేక విమానంలో ఉత్తరాఖండ్‌లోని జాలీ గ్రాంట్ విమానాశ్రయానికి ఉదయం 11.30 గంటలకు చేరుకున్నారు అనంతరం భల్లా కళాశాల మైదానం నుంచి హర్ కీ పౌడీ ప్రాంతంలో ఏర్పాటుచేసిన వేదిక వరకూ ‘అస్థి కలశ్ యాత్ర’ను నిర్వహించారు. ఈ సందర్భంగా హరిద్వార్ వీధుల్లో భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. కొందరు స్థానికులు వాజ్‌పేయి అస్థికలున్న కలశంపై పూలవర్షం కురిపించారు.
కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ చీఫ్ అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్రసింగ్ రావత్ తదితరులు 2 కి.మీ దూరం సాగిన ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభిమానులు, బీజేపీ కార్యకర్తలు వాజ్‌పేయి అమర్ రహే, వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. చివరికి హర్ కీ పౌడీలో వాజ్‌పేయి అస్థికలను రంజన్, నమిత తీసుకురాగా.. తీర్థ్ పురోహిత్ అఖిలేశ్ శాస్త్రి నిమజ్జన క్రతువును పూర్తిచేశారు. ఈ కార్యక్రమం 25 నిమిషాల పాటు కొనసాగింది. అస్థి కలశ్ యాత్ర సందర్భంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం హరిద్వార్‌లో కట్టుది ట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యాత్ర మార్గంలో 1,000 మంది పోలీసులు, సాయుధ బలగాలను మోహరించారు. మరోవైపు రాజస్తాన్ బీజేపీ చీఫ్ మదన్‌లాల్ సైనీ మాట్లాడుతూ.. వాజ్‌పేయి అస్థికలను దుంగర్‌పూర్‌లోని బనేశ్వర్ ధామ్, కోటలోని ఛంబల్ నది, అజ్మీర్‌లోని పుష్కర్ సరోవర్‌లో కూడా నిమజ్జనం చేస్తామని వెల్లడించారు.
ఈసారి బక్రీద్‌ను ఆడంబరంగా జరుపుకోం
వాజ్‌పేయి మరణం నేపథ్యంలో ఈ నెల 22న బక్రీద్ పండుగను ఆడంబరంగా జరుపుకోబోమని ఉత్తరప్రదేశ్ ఉర్దూ అకాడమీ చైర్మన్ అసిఫా జమానీ(75) తెలిపారు. మాజీ ప్రధానితో తమ కుటుంబానికి ప్రత్యేక అనుబంధముందని ఆమె మీడియాకు వెల్లడించారు. బీజేపీని ఏర్పాటుచేసిన రోజుల్లోనే తన భర్త ఐజాజ్ రజ్వీ, వాజ్‌పేయిల మధ్య పరిచయముందని అసిఫా అన్నారు. ‘బక్రీద్ పండుగ వేళ వాజ్‌పేయి లక్నోలో ఉన్నారంటే మా ఇంటికి కచ్చితంగా వచ్చేసేవారు. ఆయన లక్నోలో అడుగుపెట్టిన ప్రతిసారి ఆయన్ను తీసుకొచ్చేందుకు నా భర్త చార్‌బాగ్ రైల్వేస్టేషన్‌కు వెళ్లేవారు. వాజ్‌పేయి లక్నోలో ఎంపీగా పోటీచేసినప్పుడు ఆయన నామినేషన్ పత్రాలను నా భర్తే తయారుచేశారు. కేవలం వాజ్‌పేయి కారణంగానే నా భర్త రజ్వీ యూపీ ఎమ్మెల్సీగా మూడుసార్లు ఎన్నికయ్యారు. ఆయన్ను వాజ్‌పేయి ఎంతగా నమ్మేవారంటే.. పేపర్లు రెడీగా పెడితే వచ్చి సంతకం పెట్టేసి నామినేషన్ వేసేద్దామని అటల్‌జీ ఫోన్ చేసి చెప్పేవారు.
బక్రీద్ వేళ లక్నోలో ఉంటే వాజ్‌పేయి మా ఇంటికి వచ్చేసేవారు. రాగానే ‘నా కిమామి సేమియా ఎక్కడుంది? వెంటనే తీసుకురండి’అని చెప్పేవారు. కానీ ఆయన ఆరోగ్యం దృష్ట్యా తక్కువ చక్కెరతో వాజ్‌పేయి కోసం కిమామి సేమియా చేసేదాన్ని. దాన్ని నోట్లో పెట్టుకోగానే చక్కెర తక్కువగా ఉందని అటల్‌జీ ఫిర్యాదు చేసేవారు. అనంతరం నవ్వుతూ దాన్నంతా తినేసేవారు.’అంటూ అప్పటి రోజుల్ని అసిఫా గుర్తుచేసుకున్నారు. తమ కుటుంబంతో గడిపిన తర్వాత తిరిగివెళుతూ.. ఇద్దరు పిల్లలకు రెండు వెండి కాయిన్లను బక్రీద్ బహుమతిగా వాజ్‌పేయి ఇచ్చేవారన్నారు. తన భర్త 1998లో అకస్మాత్తుగా చనిపోగా.. తమ కుటుంబానికి వాజ్‌పేయి అండగా నిలిచారని ఆమె తెలిపారు. అంతటి అనుబంధం ఉన్న వాజ్‌పేయి చనిపోవడం తామందరినీ తీవ్రంగా బాధించిందనీ, అందువల్లే ఈసారి బక్రీద్‌ను నిరాడంబరంగా జరుపుకుంటామని అసిఫా జమానీ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment