
సాక్షి, అమరావతి/న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి(93) ఆరోగ్యం మరింత క్షీణించింది. వాజ్‌పేయి ఆరోగ్యం విషమించిందని, గత 24 గంటల్లో ఆయన పరిస్థితి మరింత దిగజారిందని బుధవారం రాత్రి 10.15 గంటల సమయంలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) ఒక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని, నిపుణులైన వైద్యుల బృందం ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తోందని పేర్కొంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్, ఛాతీలో ఇబ్బంది.. తదితర అనారోగ్య కారణాలతో వాజ్‌పేయి జూన్ 11 నుంచి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే, బుధవారం సాయంత్రానికి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని వార్తలు వెలువడ్డాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం రాత్రి 7.15 గంటల సమయంలో ఎయిమ్స్‌కు చేరుకుని వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అక్కడ ప్రధాని దాదాపు 50 నిమిషాల పాటు ఉన్నారు.వాజ్‌పేయికి ప్రస్తుతం ఒక మూత్రపిండం మాత్రమే పనిచేస్తోంది. అంతేకాకుండా, 2009లో ఆయనకు గుండెపోటు వచ్చింది. దాంతో ఆయన ఆరోగ్యం మరింతగా దెబ్బతిన్నది. జ్ఞాపకశక్తి కూడా పూర్తిగా క్షీణించింది. వాజ్‌పేయి అనారోగ్య వార్తల నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేతలంతా గురువారం నాటి తమ కార్యక్రమాలనన్నింటినీ రద్దు చేసుకున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం నూతన భవన నిర్మాణానికి గురువారం తలపెట్టిన భూమిపూజ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేశారు. వాజ్‌పేయి ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్టు బీజేపీ ప్రధాన కార్యదర్శి సత్యమూర్తి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment