
ఇంతకీ అది 'అమ్మ' గొంతేనా?
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యంపై రకరకాల వదంతులు వ్యాపిస్తున్న తరుణంలో.. చెన్నై అపోలో ఆస్పత్రిలో గత 13 రోజులుగా చికిత్స పొందుతున్న 'అమ్మ' మాట్లాడారంటూ ఒక ఆడియో క్లిప్పింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జయలలిత కోలుకుంటున్నారని, ఆమె ఆరోగ్యం బాగానే ఉందని చెప్పేందుకు ఈ ఆడియోనే సాక్ష్యం అంటూ కొందరు అన్నాడీఎంకే అభిమానులు చెబుతున్నారు. వాట్సప్‌లో దీనికి సంబంధించిన ఆడియో ఫైలు విపరీతంగా షేర్ అవుతోంది. అందులో జయలలిత మాట్లాడినట్లుగా చెబుతున్నా.. నిజానికి ఇది అమ్మగొంతులా అనిపించడం లేదని కొందరు అంటున్నారు. అయితే, ఆస్పత్రిలో బెడ్ మీద ఉన్నారు కాబట్టి, గొంతు కొంత మారి ఉంటుందన్న వాదన సైతం వినిపిస్తోంది. ఆ ఆడియోలో ఇలా ఉంది...
''నా ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతూ.. ప్రతిరోజూ నేను కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా. దేవుడి దయవల్ల నా ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది. తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత.. నేను మీ అందరి ముందుకు వచ్చి, మీకు స్వయంగా కృతజ్ఞతలు తెలుపుతా, నా అనారోగ్యానికి కారణం ఏంటో కూడా చెబుతా. నా ఆరోగ్యం గురించి వస్తున్న వదంతులను నమ్మొద్దని కోరుతున్నా.
ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నా డీఎంకే ఘన విజయాన్ని, అన్నాడీఎంకే అందిస్తున్న శాంతియుత పాలనను ఏమాత్రం జీర్ణించుకోలేని ప్రతిపక్షమే నా ఆరోగ్యం గురించి లేనిపోని వదంతులు వ్యాపింపజేయడానికి ఓవర్‌టైం పనిచేస్తోంది. కోట్లాది మంది మద్దతుదారుల ఆశీస్సులు, ఎంజీఆర్ సోదర సోదరీ మణుల ప్రేమాభిమానాలు ఉన్నంతకాలం నన్ను మీ నుంచి ఎవరూ వేరు చేయలేరు.
ఇంతకుముందు చెప్పినట్లుగానే.. నేను మీ వల్లే, మీ అందరికోసమే ఉన్నాను. అందువల్ల ఇంతకుముందు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేను ఆదరించినట్లు గానే.. ఈనెల 17, 19 తేదీలలో జరిగే పంచాయతీ ఎన్నికల్లో రెండు ఆకుల గుర్తుమీద ఓట్లు వేసి.. పార్టీకి ఘనవిజయం అందించాలని కోరుకుంటున్నా. జై అన్నా.. జై ఎంజీఆర్''