ఆస్ట్రేలియా పర్యాటకురాలి నిర్బంధం
తమిళనాడు సరిహద్దుల్లో ఆస్ట్రేలియా పర్యాటకురాలు బోటులో ఒంటరిగా సంచరిస్తుండటంతో అనుమానంతో స్థానిక మత్స్యకారులు ఆదివా రం ఆమెను నిర్బంధిచారు. కాగా, తనను నిర్బంధించిన విషయమై ఎస్పీ నవదీప్‌సింగ్ గ్రేవాల్‌కు ఆ పర్యాటకురాలు ఫిర్యా దు చేశారు. దీంతో తీరప్రాంత గస్తీ దళాలు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలతో తడ ఎస్‌ఐ అబ్దుల్జ్రాక్ పర్యాటకురాలు ఉన్న పళవేర్కాడుకు వెళ్లి వివరాలు సేకరించారు. ఆస్ట్రేలియాకు చెందిన శాన్డి (40) అనే మహిళ కాళ్లతో తొక్కి నడిపే బోటు ద్వారా జర్మనీ నుంచి ఆస్ట్రేలియాకు సముద్ర మార్గంలో పర్యటించాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఈ లక్ష్యంతో ఆమె 2011లో జర్మనీ నుంచి బయల్దేరింది.
2016 నాటికి ఆస్ట్రేలియాకు చేరుకునేలా రూట్‌మ్యాప్ తయారు చేసుకున్న శాన్డి జీపీఆర్‌ఎస్ సిస్టం ద్వారా ప్రయాణం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు సరిహద్దుల్లోకి రాగానే మత్స్యకారులు ఆమె భాషను అర్థం చేసుకోలేక అనుమానించి ఒడ్డుకు తీసుకొచ్చారు. రోజుకు 60 నుంచి 70 కిలోమీటర్లు ప్రయాణించే శాన్డి 2012లో గుజరాత్‌లో ప్రవేశించింది. కాగా, సోమవారం ఉదయం ఆమె తిరిగి ప్రయాణం సాగించేలా ఏర్పాట్లు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు.