
న్యూఢిల్లీ: విమాన ఇంధనం (ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్/ఏటీఎఫ్) ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు తగ్గుముఖం పట్టడంతో చమురు మార్కెటింగ్ సంస్థలు ఏటీఎఫ్ ధరలను 23 శాతం తగ్గించాయి. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలకన్నా చౌక ధరకు ఏటీఎఫ్ అందుబాటులోకి రావడం ఆసక్తికరం. ఢిల్లీలో ఏటీఎఫ్ ధర కిలోలీటర్ (వెయ్యి లీటర్లు)కు రూ.6,813 తగ్గడంతో రూ.22,545కు దిగొచ్చింది. అంటే లీటర్ ధర రూ.22.54గా ఉంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.69.59గా ఉండడంతో ఏటీఎఫ్ ధర మూడో వంతుకే అందుబాటులోకి వచ్చినట్టయింది. ఢిల్లీలో డీజిల్ ధర రూ.62.29గా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఏటీఎఫ్ ధరలు రెండు వంతుల మేర తగ్గడం గమనార్హం. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు చారిత్రక కనిష్టాలకు పడిపోవడం కలిసొచ్చింది.