‘బదౌన్ దారుణం’పై సీబీఐ దర్యాప్తు | 'Badaun brutally on the investigation | Sakshi
Sakshi News home page

‘బదౌన్ దారుణం’పై సీబీఐ దర్యాప్తు

Published Sun, Jun 1 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 AM

‘బదౌన్ దారుణం’పై సీబీఐ దర్యాప్తు

‘బదౌన్ దారుణం’పై సీబీఐ దర్యాప్తు

దళిత బాలికల గ్యాంగ్‌రేప్, హత్యలపై యూపీ ప్రభుత్వ నిర్ణయం

మరో ఇద్దరు నిందితుల అరెస్ట్
దుండగులను బహిరంగంగా ఉరితీయాలన్న బాధిత కుటుంబాలు

 
 బదౌన్/లక్నో: దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమైన బదౌన్ దళిత బాలికల గ్యాంగ్‌రేప్, హత్యల కేసుపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. బాధిత కుటుంబాల డిమాండ్ మేరకు సీబీఐ దర్యాప్తునకు సిఫార్సు చేయాలని ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ నిర్ణయించారని రాష్ట్ర ప్రభుత్వం శనివారం తెలిపింది. ఈ దారుణంపై సమాజ్‌వాదీ పార్టీ ప్రభుత్వం సరిగ్గా వ్యవహరించడం లేదని విమర్శలు వెల్లువెత్తడంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోపక్క.. ఈ కేసులో ఏడుగురు నిందితుల్లోని పోలీస్ కానిస్టేబుల్ సర్వేశ్ యాదవ్, పప్పూ, అవధేశ్ అనే సోదరులను శుక్రవారం అరెస్టు చేసిన పోలీసులు శనివారం ఛత్రపాల్ అనే మరో కానిస్టేబుల్‌ను, పప్పూ, అవధేశ్‌ల సోదరుడు ఉర్వేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పప్పూ, అవధేశ్, ఉర్వేశ్‌లపై హత్య, అత్యాచార నేరాల కింద, కానిస్టేబుళ్లపై నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేశామని, మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. బదౌన్ జిల్లా కాత్రాసదత్ గంజ్ గ్రామానికి చెందిన వరుసకు అక్కాచెల్లెళ్లయ్యే 14-15 ఏళ్ల వయసున్న ఇద్దరు దళిత బాలికలు గత నెల 27న అదృశ్యమై, మరుసటి రోజు విగతజీవులై మామిడిచెట్టుకు వేలాడుతూ కనిపించడం తెలిసిందే. వీరు హత్యకు ముందు అత్యాచారానికి గురయ్యారని పోస్ట్‌మార్టమ్‌లో తేలడం, బాధిత కుటుంబాలకు అఖిలేశ్ రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించడమూ విదితమే.

‘నిర్భయ ఉదంతం కంటే దారుణం’

 తమ పిల్లలను బలిగొన్న దుండగులను బహిరంగంగా ఉరితీయాలని బాధిత  కుటుంబాలు డిమాండ్ చేశాయి. ఈ ఘోరం ఢిల్లీలో గ్యాంగ్‌రేప్‌కు గురై, చనిపోయిన నిర్భయ ఉదంతం కంటే దారుణమైందన్నాయి. తమకు నష్టపరిహారం వద్దని, న్యాయం కావాలని కోరాయి.‘అభం శుభం తెలియని మా చిన్నారుల ఉరిని లోకం చూసింది. దుండగులను కూడా  అలాగే లోకం చూసేలా ఉరితీయాలి.  మమ్మల్ని చంపుతామంటున్నారు. చంపనీయండి. కానీ ఆ రూ.5 లక్షల చెక్కును మాత్రం ముట్టను’ అని ఓ బాధిత బాలిక తండ్రి అన్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే తమ పిల్లలు బతికేవారన్నారు.

 బాలికల కుటుంబాలకు రాహుల్ పరామర్శ

 కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ శనివారం బాధిత కుటుంబాలను కలుసుకుని పరామర్శించారు. డబ్బుతో తమ కుమార్తెల గౌరవాన్ని తిరిగి తెచ్చుకోలేమని బాధితులు ఆయనతో అన్నారు. ఈ ఘోరంలో పోలీసుల పాత్ర కూడా ఉంది కనుక తమకు రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదన్నారు. వారి అభిప్రాయాలతో ఏకీభవించిన రాహుల్, స్త్రీల గౌరవానికి వెలకట్టలేర ని, ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బాలికలను ఉరితీసిన ప్రాంతాన్ని చూశారు. గ్రామంలో ఇలాంటి దారుణాలు తరచూ జరుగుతున్నా పరువు పోతుందని చెప్పుకోలేకపోతున్నామని గ్రామస్తులు చెప్పారు.  

అఖిలేశ్‌వి హద్దుమీరిన వ్యాఖ్యలు: స్మృతీ ఇరానీ

యూపీలో శాంతిభద్రతలు బాగున్నాయంటూ ప్రచారం చేయాలని సీఎం అఖిలేశ్ శుక్రవారం విలేకర్లతో  చెప్పడంపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు హద్దుమీరాయని, బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు అలా మాట్లాడకూడదని అన్నారు. కాగా, అఖిలేశ్ శనివారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జావేద్ ఉస్మానీని తొలగించి, ఆయన స్థానంలో అలోక్ రంజన్ అనే ఐఏఎస్‌ను నియమించారు. దీనికి కారణమేంటో ప్రభుత్వం వెల్లడించలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement