‘బదౌన్’ దారుణానికి పాల్పడ్డాం | 'Badaun' roots Agreed to a mistake | Sakshi
Sakshi News home page

‘బదౌన్’ దారుణానికి పాల్పడ్డాం

Published Mon, Jun 2 2014 2:05 AM | Last Updated on Wed, Aug 29 2018 8:07 PM

‘బదౌన్’ దారుణానికి పాల్పడ్డాం - Sakshi

‘బదౌన్’ దారుణానికి పాల్పడ్డాం

నేరాన్ని అంగీకరించిన ఇద్దరు నిందితులు
బాధిత కుటుంబాలకు మాయావతి పరామర్శ

 
బదౌన్(ఉత్తరప్రదేశ్): సంచలనం సృష్టించిన బదౌన్ దళిత బాలికల గ్యాంగ్‌రేప్, హత్యల కేసులో అరెస్టయిన ఐదుగురు నిందితుల్లో ఇద్దరు తాము ఆ నేరం చేశామని అంగీకరించారు. తమ విచారణలో వీరు నేరం ఒప్పుకున్నారని బదౌన్ జిల్లా ఎస్పీ అతుల్ సక్సేనా ఆదివారం చెప్పారు. అయితే వారిద్దరి పేర్లను వెల్లడించలేదు. చాలా కేసుల్లో నిందితులు కోర్టులో మాట మారుస్తుంటారు కనుక ఈ కేసులో నేరాంగీకారంపై ఆధారపడకుండా గట్టి సాక్ష్యాధారాల కోసం కృషి చేస్తామన్నారు. ఈ కేసులోని ఏడుగురు నిందితుల్లో పప్పూ, అవధేశ్, ఉర్వేశ్ యాదవ్ అనే సోదరులను, ఛత్రపాల్ యాదవ్, సర్వేశ్ యాదవ్ అనే పోలీస్ కానిస్టేబుళ్లను పోలీసులు  శుక్ర, శనివారాల్లో అరెస్ట్ చేసి , పప్పూ సోదరులపై హత్య, అత్యాచార కేసులు, కానిస్టేబుళ్లపై నేరపూరిత కుట్ర కేసులను నమోదు చే శారు. కాత్రా షహదత్‌గంజ్ గ్రామానికి చెందిన వరుసకు అక్కాచెల్లెళ్లయ్యే 14-15 ఏళ్ల వయసున్న ఇద్దరు దళిత బాలికలు గత నెల 27న అదృశ్యమై, మరుసట్రోజు విగత జీవులై చెట్టుకు వేలాడటం తెలిసిందే.

యూపీలో ఆటవిక పాలన: మాయావతి

 బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు రాజకీయ నేతలు క్యూ కట్టారు. బీఎస్పీ చీఫ్ మాయావతి, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన స్థానిక ఎంపీ ధర్మేంద్ర యాదవ్ తదితరలు శనివారం వారిని కలుసుకుని పరామర్శించారు. అఖిలేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఆటవిక పాలన సాగిస్తోందని మాయావతి మండిపడ్డారు. ఈ కేసును కప్పిపుచ్చి, నీరుగార్చేందుకు ప్రయత్నిస్తోందని, అందుకే బదౌన్‌కు వచ్చానని చెప్పారు. బాధిత కుటుంబాలకు బీఎస్పీ నిధి నుంచి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వ పరిహారాన్ని నిరాకరించిన బాధితులు తానేమిచ్చినా తీసుకుంటామన్నారని ఆమె తెలిపారు. స్థానిక ఎంపీ నుంచి పరిహారం తీసుకోవడానికి వారు నిరాకరించారన్నారు. కాగా, ఎంపీ ధర్మేంద్ర యాదవ్‌పై బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కులం కారణంగానే పోలీసులు తమ ఫిర్యాదుపై సకాలంలో స్పందించలేదన్నాయి.

 కాత్రాలోని ఇళ్లలో మరుగుదొడ్లు నిర్మిస్తాం: సులభ్

 కాత్రా గ్రామానికి చెందిన ఇద్దరు దళిత బాలికలు కాలకృత్యాల కోసం పొలాల్లోకి వెళ్లి అత్యాచారానికి, హత్యకు గురికావడంపై సులభ్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ గ్రామంలోని అన్ని ఇళ్లలో మరుగుదొడ్లను నిర్మిస్తామని, సోమవారమే పనులు ప్రారంభిస్తామని సంస్థ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ లక్నోలో చెప్పారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement