
సాక్షి బెంగళూరు: ‘ఆపరేషన్ కమల’లో భాగంగా ఆడియో కేసుకు సంబంధించి రాయచూరు జిల్లాలో తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కోర్టు ఆయనకు షరతులతో కూడిన మందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసుకు సంబంధించి యడ్యూరప్పతో పాటు మరో నలుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేసులో ఉన్న మిగతా వారికి కూడా ముందస్తు బెయిల్ వచ్చింది. జేడీఎస్ ఎమ్మెల్యే నాగనెగౌడ కందకూరు తనయుడు శరణేగౌడ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయచూరు జిల్లా దేవదుర్గ పోలీస్‌స్టేషన్‌లో యడ్యూరప్పపై కేసు నమోదైంది.
కలబుర్గి హైకోర్టు బెంచి పరిధిలోకి దేవదుర్గ పోలీస్ స్టేషన్ వస్తుంది. ఫలితంగా కలబుర్గి హైకోర్టు బెంచికి అర్జీ ఇవ్వనున్నారు. కాగా అవినీతి నిరోధక చట్టం ప్రకారం దేవదుర్గ పోలీస్ స్టేషన్‌లో యడ్యూరప్పపై కేసు నమోదు చేశారు. రూ.లక్ష విలువ చేసే బాండు, పోలీసుల దర్యాప్తునకు సహకరించాలి. సాక్షులను ప్రభావితం చేయకూడదు. కోర్టు అనుమతి లేనిదే పరిధి దాటి వెళ్లకూడదని తదితర షరతులతో సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment