భారీ ప్రవాహంతో కుప్పకూలిన బ్రిడ్జి
హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఆ ప్రవాహ వేగానికి బెయిలీ బ్రిడ్జి ఒకటి మధ్యలో కూలిపోయింది. సమీపంలోని రోహ్‌టంగ్ టన్నెల్ ప్రాజెక్టుకు నిర్మాణ సామగ్రి తరలించడం కోసం ఏర్పాటు చేసిన ఈ బ్రిడ్జి మీద లారీ వెళ్తుండగా కూలిపోయింది. డ్రైవర్‌ను వెంటనే రక్షించారు. బెయిలీ బ్రిడ్జి ఉన్నట్టుండి కూలిపోయింది గానీ, ఇందులో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని రోహ్‌తంగ్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ బ్రిగెడియర్ డీఎన్ భట్ తెలిపారు. రాబోయే నాలుగైదు రోజుల్లో బ్రిడ్జిని పునరుద్ధరిస్తామని, కొట్టుకుపోయిన లారీని కూడా బయటకు తీస్తామని చెప్పారు. ఈ ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలు రావడంతో పాటు కొండ చరియలు విరిగిపడ్డాయి. దాంతో ఈ ప్రాంతంలో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి.
లెహ-మనాలి మార్గంలో ఉన్న రోహ్‌తంగ్ పాస్ వద్ద తలపెట్టిన 8.8 కిలోమీటర్ల రోహ్‌తంగ్ సొరంగం దేశంలోనే అతి పొడవైన సొరంగం అవుతుంది. మంచు కారణంగా ఆరు నెలల పాటు రోహ్‌తంగ్ పాస్‌ను మూసేస్తారు. సొరంగం నిర్మాణం పూర్తయితే ఏడాది పొడవునా రోహ్‌తంగ్ పాస్ మార్గాన్ని తెరిచే ఉంచేందుకు అవకాశం ఏర్పడుతుంది.