సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ వింతల్లో ఒకటిగా నిలిచిన అద్భుత కట్టడం తాజ్ మహల్ చుట్టూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన పర్యాటక ప్రాంతాల జాబితా నుంచి తాజ్‌మహల్‌ను తొలగించడంతో మొదలైన వివాదం.. బీజేపీ ఎమ్మేల్యే సంగీత్ సోమ్ చేసిన వ్యాఖ్యలతో మరో మలుపు తీసుకుంది. అదే సమయంలో తాజ్ మహల్ ఒకప్పటి శివాలయం అంటూ ఎంపీ వినయ్ కతియార్ చేసిన మరో వ్యాఖ్య వివాదాన్ని మరింత పెంచింది. అప్పటినుంచి తాజ్ చుట్టూ వివాదాలు రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్నాయి.
తాజాగా రాష్ట్రీయ స్వయక్ సేవక్ సంస్థ (ఆర్‌ఎస్‌ఎస్) అనుబంధ సంస్థ అయిన అఖిల భారతీయ ఇతిమాస్ సంకల్ప సమితి (ఏకేబీఐఎస్‌ఎస్) సంస్థ ఒకటి తాజ్ దగ్గర ముస్లిం మత ప్రార్థనలను నిషేధించాలని డిమాండ్ చేసింది. ఏకేబీఐఎస్‌ఎస్ జాతీయ కార్యదర్శి డాక్టర్ బాలముకుంద్ పాండే.. మాట్లాడుతూ తాజ్ మహల్ అనేది జాతి వారసత్వ సంపద అయినప్పుడు.. కేవలం ఒక్క ముస్లింలకు మాత్రమే అక్కడ ప్రార్థన చేసుకునే అవకాశం ఎలా కల్పిస్తారని ఆయన ప్రశ్నించారు. తాజ్ మహల్ దగ్గర నమాజ్ చేయడాన్ని తక్షణమే నిషేధించాలని ఆయన యూపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తాజ్ మహల్ దగ్గర ముస్లింలు నమాజ్ చేయడాన్ని నిషేధించలేకపోతే.. హిందువులకు కూడా.. అక్కడ శివ పూజ చేసుకునే అవకాశాన్నికల్పించాలని డిమాండ్ చేశారు. దేశాన్ని పాలించిన ముస్లిం చక్రవర్తులు.. అనేక ఆలయాలు పడగొట్టి సమాధులు కట్టారని ఆయన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment