అత్యాచారాలకు మొబైల్ ఫోన్లే కారణం:శాసనసభా కమిటీ
బెంగళూరు: అత్యాచారాలు, లైంగిక వేధింపులను నియంత్రించాలంటే పాఠశాలలు, కళాశాలకు విద్యార్థులు మొబైల్ ఫోన్లు తీసుకురాకుండా నిషేధం విధించాలని కర్ణాటక శాసనసభా కమిటీ సిఫారసు చేయడం వివాదాస్పదమైంది. స్కూళ్లు, కాలేజీల్లో మొబైల్స్‌పై నిషేధం విధించేలా విద్యా శాఖకు ఆదేశాలు జారీ చేయాలని స్త్రీ, శిశు సంక్షేమంపై ఏర్పాటైన శాసనసభా కమిటీ కర్ణాటక ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ ఓ నివేదికను సమర్పించింది. శకుంతలా శెట్టి నేతత్వంలోని 23 మంది సభ్యుల కమిటీ సమర్పించిన ఈ నివేదిక శుక్రవారం అసెంబ్లీ ముందుకు వచ్చింది.
దేశవ్యాప్తంగా మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు పెరుగుతున్నాయని, ఈ తరహా ఘటనల వల్ల ప్రపంచం ముందు మన దేశం తలదించుకోవాల్సి వస్తోందని కమిటీ ఆవేదన వ్యక్తం చేసింది. స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే బాలికలపై అత్యాచారాలు, అదృశ్యం కేసులను పరిశీలించగా, దీనికి మొబైల్ ఫోన్లే కారణమని వెల్లడైందని శకుంతలా శెట్టి సమర్థించుకున్నారు. అత్యాచారాలకు గురైన ఇద్దరు, ముగ్గురు బాలికలను తాము ప్రశ్నించామని, మిస్డ్ కాల్‌తో మొదలైన పరిచయాలు అత్యాచారాలకు దారి తీసినట్లుగుర్తించామని చెప్పారు. అందువల్లే స్కూళ్లు, కాలేజీల్లో మొబైల్స్‌పై నిషేధం విధించాలని సూచించామన్నారు.
మహిళలపై వేధింపులకు సంబంధించి స్కూళ్లు, కాలేజీల్లో తరచుగా సెమినార్లు, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని, పోలీసుల పనితీరును మెరుగు పరిచేందుకు పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రతి స్టేషన్లో 20 శాతం మంది మహిళా పోలీసులను నియమించాలని, మరిన్ని మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కూడా ఈ కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.