గార్డును కట్టేసి ఏటీఎం దోపిడీకి యత్నం
బెంగళూరులో ఘటన
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో కార్పొరేషన్ బ్యాంకు మేనేజర్ జ్యోతి ఉదయ్‌పై దుండగుడి దాడిని మరవకముందే నగరంలో ఓ ఏటీఎం దోడీపీకి విఫలయత్నం జరిగింది. దోపిడీ దొంగ.. ఏటీఎం సెక్యూరిటీ గార్డును కట్టేసి లూటీకి ప్రయత్నించాడు. ఆదివారం వేకువజామున నగర శివారులోని హొంగసంద్రలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సందీప్ అనే దుండగుడు ఏటీఎం కేంద్రంలోకి చొరబడి సెక్యూరిటీ గార్‌డ షహబుద్దీన్‌పై వేట కొడవలితో దాడి చేసి బంధించాడు. ఏటీఎంలోని నగదు లూటీకి విఫలయత్నం చేశాడు.
ఇంతలో బీట్ కానిస్టేబుల్ అటుగా రావడంతో ఏటీఎం కేంద్రం బయట బైక్‌పై హెల్మెట్ పెట్టుకుని ఉన్న మరో నిందితుడు ‘పోలీస్’ అంటూ అరిచాడు. దీంతో సందీప్ పారిపోవడానికి యత్నించగా, అప్పటికే కట్లు వదులు చేసుకున్న షహబుద్దీన్ అక్కడే ఉన్న కొడవలితో సందీప్‌ను వెంటాడి పట్టుకున్నాడు. సందీప్‌కు తోడుగా వచ్చిన నిందితుడు బైక్‌పై పారిపోయాడు. సందీప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, పారిపోయిన నిందితుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. లూటీ యత్నం దృశ్యాలు ఏటీఎంలోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయన్నారు.