కుక్కల బోనులో పడేసి కర్కశంగా...
సాక్షి, బెంగళూర్: కర్ణాటకలోని మదికెరిలో దారుణం చోటుచేసుకుంది. అప్పు చెల్లించలేదని ఓ వ్యక్తిని కుక్కలతో కరిపించాడు మాజీ యజమాని. తీవ్రగాయాలైన యువకుడు పొన్నంపేట్ పోలీసులను ఆశ్రయించటంతో విషయం వెలుగులోకి వచ్చింది.
మొక్కల పెంపకం నిర్వహించే కిషన్ దగ్గర హరీష్ అనే యువకుడు పని చేసేవాడు. అవసరాల నిమిత్తం యజమాని నుంచి 4000 రూపాయలు హరీష్ అప్పుగా తీసుకున్నాడు. అయితే బాకీ తీర్చకపోగా, ఉద్యోగం మానేసి తన బంధువు షాపులో దగ్గర పనికి కుదిరాడు. దీంతో ఆగ్రహం చెందిన కిషన్, మధు అనే మరో వ్యక్తితో ఆగష్టు 29న హరీష్ పని చేస్తున్న చొటు దగ్గరికి వెళ్లారు.
తన దగ్గర డబ్బులు లేవని, బాకీ తీర్చలేనని చెప్పటంతో బలవంతంగా హరీష్ ను వాహనంలో ఎక్కించుకుని తమ ఫ్లాంటేషన్ సెంటర్ కు తీసుకొచ్చారు. అక్కడ కుక్కల బోనులో హరీష్ ను తోసేయగా, అవి కరవటంతో తీవ్రంగా గాయపడ్డాడు. చివరకు చనిపోతాడని భావించి సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మైసూర్‌కు తరలించారు. బాధితుడి తలకు, చేతికి తీవ్రగాయాలయ్యాయి.
అయితే దాడి విషయంలోనే చిన్న గందరగోళం నెలకొందని డీఎస్పీ నాగప్ప చెబుతున్నారు. అతనిని బోనులోకి పడేశారా? లేక కుక్కలనే అతని మీదకు ఉసిగొల్పరా? అన్నది తేలాల్సి ఉందని ఆయన అంటున్నారు. అది తేలితేగానీ నిందితులపై చర్యలు తీసుకోలేమని నాగప్ప స్పష్టం చేశారు.