madikeri
-
ఏఎస్ఐ వర్సెస్ మాజీ స్పీకర్: సిగ్గుండాలి.. మీకు పిల్లలు లేరా?
సాక్షి, బెంగళూరు/బనశంకరి: కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ రమేశ్‌కుమార్‌పై బెంగళూరు జేపీ నగర పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే గోపి అనే ఏఎస్ఐ మండిపడ్డారు. ఆదివారం గోపి మాట్లాడిన ఆడియో క్లిప్ వైరల్ అయింది. ‘‘మాజీ సభాధ్యక్షునికి మొదటి నుంచీ గౌరవం ఇస్తున్నాం. కానీ ఆయన అందరు రాజకీయనేతల కంటే భిన్నంగా ఉంటారు. ప్రవర్తన సరిగాలేదు’’ అని ఆడియో క్లిప్‌లో విమర్శలు చేశాడు. ‘‘ఇతను (రమేశ్‌కుమార్) రోడ్డులో వెళుతుండగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఏమి చెబుతారంటే రహదారుల్లో సక్రమంగా వాహనాలు తనిఖీలు చేయడం లేదంటారు. మా కుటుంబాల గురించి మాట్లాడతారు. మేం ఇతని కుటుంబం గురించి మాట్లాడామా? మా విధుల గురించి మాట్లాడాలి. ఇతనిపై ఉన్న గౌరవం కూడా పోయింది’’ అని ఏఎస్ఐ అన్నారు. తనిఖీలు చేయడం మీ భార్యపిల్లలకు మంచిది కాదని ఆయన చెప్పడం ఎంతవరకు సమంజసం అని మాజీ స్పీకర్‌పై మండిపడ్డారు. వివాదం ఎక్కడ మొదలైంది రోడ్డుపై వాహనాలను నిలిపి జరిమానా విధిస్తున్న చింతామణి పట్టణ పోలీసులను ఎమ్మెల్యే రమేశ్‌కుమార్ మందలించారు. ఇది వివాదానికి దారితీసింది. కాగా శుక్రవారం, ఎస్ఐ ముక్తియార్ సిబ్బందితో తాలూకాలోని మడికెరి క్రాస్‌లో వాహనాలను అడ్డుకుని జరిమానా విధిస్తున్నారు. ఈ సమయంలో శ్రీనివాసపుర నుంచి బెంగళూరుకు వెళుతున్న రమేశ్‌కుమార్ తన వాహనాన్ని నిలిపి.. ‘‘పోలీసులను పిలిచి రోడ్ల మధ్యలో వాహనాలను నిలిపి జరిమానా విధించరాదని ఇటీవల హోంమంత్రి ఆదేశాలు జారీచేశారు కదా. మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది మీ కుటుంబానికి మంచిదికాదు. ఏం డాక్యుమెంట్లను చెక్ చేస్తారు? సిగ్గుండాలి మీకు. హోంమంత్రి చెప్పినా వినిపించుకోరా?, ఇదే మీ ఉద్యోగమా మీకు’’ అని ఘాటుగా ప్రశ్నించారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి. ఏఎస్ఐ ఆడియోపై రమేశ్‌కుమార్ స్పందిస్తూ టోల్గేట్ వద్ద పోలీసుల ప్రవర్తన బాధ కలిగించడంతో మీకు పిల్లలు లేరా? వెళ్లండి అని అన్నాను అని చెప్పారు. ఈ వివాదంపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి! చదవండి: Karnataka: రూపాయికే రొట్టె, అన్నం, సాంబార్ -
వరద బీభత్సంలో పెళ్లి బాజా
యశ్వంతపుర (బెంగళూరు): అంతా సవ్యంగా ఉంటే ఈపాటికి ఆ ఇంట బంధు మిత్రులతో పెళ్లి సందడి నెలకొనేది. అయితే అనూహ్యంగా వరద విపత్తు కారణంగా సర్వం కోల్పోయిన ఆ కుటుంబానికి మేమున్నామంటూ అధికారులు దగ్గరుండి పెళ్లి జరిపించిన ఘటన కర్ణాటకలో వరద బాధిత కొడగు జిల్లాలో జరిగింది. మడికెరి తాలూకా మక్కందూరుకు చెందిన మంజుల, కేరళలోని కణ్ణూరు కుతుపరంబుకు చెందిన రాజేష్‌లకు ఈ నెల 26న పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయించారు. పెళ్లికి పదిరోజుల ముందుగానే భారీవర్షాలు కొడగు జిల్లాను ముంచెత్తగా మంజుల ఇల్లు నీటమునిగింది. పెళ్లి దుస్తులు, నగదు, బంగారు మొత్తం వరదలో కొట్టుకుపోయాయి. దీంతో ఆ కుటుంబం పునరావాస కేంద్రంలో తలదాచుకుంది. పెళ్లిని వాయిదా వేయాలని అనుకున్నారు. ఇది తెలుసుకున్న మడికెరి లయన్స్‌క్లబ్, సేవా భారతి సభ్యులు వారి పెళ్లి జరిపించడానికి సిద్ధమయ్యారు. మడికెరిలోని ఓంకారేశ్వరి దేవస్థానంలో ఆదివారం అనుకున్న ముహూర్తానికే వైభవంగా పెళ్లి చేసి మంజుల, రాజేష్‌లను ఆశీర్వదించారు. పెళ్లిలో జిల్లా కలెక్టర్ శ్రీవిద్య సహా పలువురు అధికారులు పాల్గొని దీవించారు. -
నా కుటుంబాన్ని ఆదుకోండి : నటి
మడికెరిలో చిక్కుకున్న తన కుటుంబాన్ని తక్షణం రక్షించాలని కన్నడనటి దిశా వూవయ్య శనివారం సీఎం కుమారస్వామికి విజప్తి చేశారు. 8 మంది కుటుంసభ్యులు బయటకు రావడానికి వీలుకాక ఇంటిలో ఉన్నారని, వారిలో ఒక గర్భిణి కూడా ఉన్నట్లు ఆమె సీఎంతో విన్నవించారు. తక్షణం ఆమెకు వైద్య సహాయం కూడా చేయాలన్నారు. అదే ప్రాంతంలో 40 మంది వరదలో చిక్కుకున్నట్లు తెలిపారు. సీఎం సహాయక చర్యలకు ఆదేశించారు. రోజుల తరబడి సూర్యుని ముఖం చూడలేదు. నిరంతరం వర్షమే. ఇల్లు, వీధి అనే తేడాలేకుండా ఎక్కడ చూసినా నీళ్లేనీళ్లు. అయినా తాగడానికి నీళ్లు లేవు. తినడానికి తిండి లేదు, ఉండడానికి చోటు లేదు. ఇదీ వరదబాధిత కొడగులో జనం దీనావస్థ సాక్షి, బెంగళూరు: కరావళి, మలెనాడు ప్రాంతాలు వరద గుప్పిట్లో విలవిలాడుతున్నాయి. సుమారు 12 రోజులుగా కుంభవృష్టి కొడగు, దక్షిణ కన్నడ, ఉడుపి, హాసన్, చిక్కమగళూరు, చామరాజనగర, శివమొగ్గ తదితర జిల్లాలను వణికిస్తోంది. కొడగు అత్యధికంగా నష్టపోయింది. జిల్లాలో ఇప్పటికి ఆరుగురు మరణించగా, సుమారు 100 మంది ఆచూకీ తెలియడం లేదు. వర్షాల ప్రభావంతో కొడగు జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. సైన్యం రంగంలోకి దిగింది. హెలికాప్టర్ల ద్వారా వర్షబాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిల్లో పడ్డారు. కొడగు, చామరాజనగర, మంగళూరు, మండ్య, హాసన్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు. చిక్కుకుపోయిన బాధితులు ♦ కొడగు జిల్లాలో హెమ్మెతాళు, మేఘతాళు, కాలూరు గ్రామాల్లో కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో సుమా రు 500 మంది చిక్కుకుపోయారు. ♦ మంగళూరు – మడికెరి రహదారిలో కొండ విరిగిపడడంతో 200 మంది పైగా చిక్కుకున్నారు. దీనికి తోడు అన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలకు పలు చోట్ల ఆశ్రయాలు ఏర్పాటు చేశారు. వరదల్లో ఇరుక్కున్నవారిని రక్షించడానికి ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ ద్వారా చర్యలు చేపట్టారు. ♦ రామ, లక్ష్మణ తీర్థనదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. ♦ 150 మంది కేఆఎస్ ఆర్టీసీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మూడు ఐరావత బస్సులను బాధితుల సౌకర్యార్థం ఉచితంగా కేటాయించారు. కేరళ పాలఘాట్ నుంచి మంగళూరు వరకు ప్రయాణికులు ఆ బస్సుల గుండా ఉచితంగా చేరుకోవచ్చు. కావేరి తీరంలో అలజడి కే ఆర్ఎస్ జలాశయంలోకి లక్ష క్యూసెక్కుల నీరు చేరింది. ఫలితంగా మండ్య, చామరాజనగర ప్రాంతాలతో పాటు కావేరి నదీ తీర ప్రాంతంలో జనాలు భయంభయంగా జీవనం సాగిస్తున్నారు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని గుబులు నెలకొంది. ఐదురోజుల నుంచీ నదీ తీరంలోని దేవస్థానాలు, నివాసాలు జలావృతమయ్యాయి. నదీ తీరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మంత్రుల పర్యటన కొడగు జిల్లాలో ఇప్పటి వరకు సుమారు మూడువేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా ఆరు వందల మంది రక్షణ కోసం ఎదురు చూస్తున్నారు. వరద పీడిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి డీవీ సదానందగౌడ, రాష్ట్రమంత్రులు ఆర్వీ దేశపాండే, జీటీ దేవెగౌడ, సా.రా.మహేశ్, ఎన్.మహేశ్ తదితరులు సందర్శించి సాయం అందజేస్తామని ప్రకటించారు. -
‘కూర్గ్’ సొగసు చూడతరమా!
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక రాష్ట్రంలోని ‘కూర్గ్’ పేరు వినగానే ఎవరికైనా ఒళ్లు పులకరిస్తుంది. పలు రకాల పూల సమ్మిళిత సువాసనలు. రకరకాల కాఫీ గింజల గుబాళింపులు ముక్కు పుటాలను అదరగొడతాయి. ఊపిరితిత్తులకు కొత్త ఊపిరినిస్తాయి. అనిర్వచనీయమైన అనుభూతినిస్తాయి. అందమైన పచ్చిక బయళ్లు, గుబురైన చెట్ల సముదాయంతో బారులు తీరిన పర్వత శ్రేణులు, వాటి మధ్యనుంచి జాలువారే జలపాతాలు, కొమ్మ కొమ్మకు పలకరించే పక్షుల కిలకిలారావాలు. వన్య ప్రాణుల అలజడి మదిలో మెదులుతాయి. ఇదంతా వినడం వల్లనే, చదవడం వల్లనే మనలో కలిగే అనుభూతి. ఇక ప్రత్యక్షంగా వీక్షిస్తేనా....? ఆ అనుభూతిని ఎవరైనా మాటల్లో చెప్పడం కష్టం. ఎవరికి వారు ఆ అనుభూతిని అనుభవించి పరవశించాల్సిందే. అందుకే కూర్గ్‌ను ‘స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా’ అని అభివర్ణించారేమో! పర్యాటకులు కూడా పలు రకాలుగా ఉంటారు వయసురీత్యా, అభిరుచుల రీత్యా. కొందరికి చెట్టూ పుట్టలు పట్టుకొని ట్రెక్కింగ్ చేయడం, సుడులు తిరిగే సన్నటి నదీ పాయలో రాఫ్టింగ్ చేయడం, పారా గ్లైడింగ్ చేయడం, పారా జంపింగ్ చేయడం, బోటింగ్ చేయడం, రోప్‌వేలో ప్రయాణించడం ఇష్టం. లగ్జరీ రిసార్టుల్లో ఇవి అందుబాటులో ఉన్నా అంత డబ్బు వెచ్చించని వారికి అందుబాటులో ఉండవు. మరికొందరికి ప్రశాంత వాతావరణం ఇష్టం. కంటి ముందు కనిపించే కొండ కోనల్ల నుంచి వచ్చే చల్లటి, స్వచ్ఛమైన గాలులను ఆస్వాదించడం, దట్టమైన చెట్ల మధ్య నుంచి కాలిబాటన కాస్త దూరం ప్రయాణించడం, జలపాతాలను ఆస్వాదించడం, పక్షలు, వన్య సంరక్షణ ప్రాంతాలను సందర్శించడం వారికీ హాబీ. డబ్బును దండిగా ఖర్చు పెట్టే వారి కోసం కూర్గ్ రాజధాని మడికరి ప్రాంతంలో పలు లగ్జరీ రిసార్టులుండగా, రెండో కేటగిరీ వాళ్ల కోసం కూర్గ్‌లోని కుట్టా ప్రాంతంలో సరైన కాటేజీలు ఉన్నాయి. మడికేరి ఏడు కిలోమీటర్ల దూరంలో రాష్ట్రంలోనే అతిపెద్ద ‘అబే’ జలపాతం ఉండగా, కుట్టాకు సమీపంలో రెండవ అతిపెద్ద జలపాతం ‘ఇరుప్పు’ ఉంది. అబే జలపాతం పర్యాటకులతో కిక్కిరిసిపోతుండగా, ఇరుప్పు ప్రశాంతంగా ఉంటుంది. దీని పక్కనే పక్షుల సంరక్షణ కేంద్రం ఉండగా, ట్రెక్కింగ్ చేసే కుర్రకారు కోసం నిటారైన కొండ ఉండనే ఉంది. ఇరుప్పు జలపాతం సమీపంలో పర్యాటకులు ఉండేందుకు పలు కాటేజీలు అందుబాటులో ఉన్నాయి. అవన్నీ కొండ దిగువ ప్రాంతంలో ఉండగా, పూర్తిగా కొండ ఎగువున ‘ట్రాపికల్ బూమ్స్’ అనే కాటేజీ కొత్తగా వెల్సింది ఆకర్షణీయంగానే కాకుండా, అందుబాటు ధరల్లో ఉంది (ఆసక్తిగల వారు మరిన్ని వివరాలకు 9449118698 మొబైల్ నంబర్‌ను సంప్రదించవచ్చు). ఎక్కడికి వెళ్లనవసరం లేకుండానే ఈ క్యాటీజీ వసారాలో కూర్చొని ఆవలి కొండలను, కొండలను కౌగలించుకునే మబ్బులను, ఎప్పుడూ కురిసే మంచు ముత్యాలను చూడవచ్చు. ఈ కాటేజీకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే ‘ఇరుప్పు’ వాటర్ ఫాల్స్ ఉండగా, పది కిలోమీటర్ల దూరంలో నాగర్హోల్ నేషనల్ పార్క్, అంతే దూరంలో తోల్పట్టి వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం ఉంది. కాఫీ గింజల సువాసనలు, పూల గుబాళింపులు ఎల్లప్పుడు పలకరిస్తూనే ఉంటాయి. రుతువులతో సంబంధం లేకుండా ఎప్పుడైనా కూర్గ్‌ను సందర్శించవచ్చు. ఒక్కో రుతువులో ఒక్కో రకమైన అనుభూతిని పొందవచ్చు. నిండైన వాగులు, వంకలతోపాటు పచ్చదనం ఎక్కువగా ఉండే ‘సెప్టెంబర్ నుంచి మార్చి’ మధ్యలో సందర్శించడం మరీ బాగుంటుంది. -
కుక్కల బోనులో పడేసి కర్కశంగా...
సాక్షి, బెంగళూర్: కర్ణాటకలోని మదికెరిలో దారుణం చోటుచేసుకుంది. అప్పు చెల్లించలేదని ఓ వ్యక్తిని కుక్కలతో కరిపించాడు మాజీ యజమాని. తీవ్రగాయాలైన యువకుడు పొన్నంపేట్ పోలీసులను ఆశ్రయించటంతో విషయం వెలుగులోకి వచ్చింది. మొక్కల పెంపకం నిర్వహించే కిషన్ దగ్గర హరీష్ అనే యువకుడు పని చేసేవాడు. అవసరాల నిమిత్తం యజమాని నుంచి 4000 రూపాయలు హరీష్ అప్పుగా తీసుకున్నాడు. అయితే బాకీ తీర్చకపోగా, ఉద్యోగం మానేసి తన బంధువు షాపులో దగ్గర పనికి కుదిరాడు. దీంతో ఆగ్రహం చెందిన కిషన్, మధు అనే మరో వ్యక్తితో ఆగష్టు 29న హరీష్ పని చేస్తున్న చొటు దగ్గరికి వెళ్లారు. తన దగ్గర డబ్బులు లేవని, బాకీ తీర్చలేనని చెప్పటంతో బలవంతంగా హరీష్ ను వాహనంలో ఎక్కించుకుని తమ ఫ్లాంటేషన్ సెంటర్ కు తీసుకొచ్చారు. అక్కడ కుక్కల బోనులో హరీష్ ను తోసేయగా, అవి కరవటంతో తీవ్రంగా గాయపడ్డాడు. చివరకు చనిపోతాడని భావించి సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం మైసూర్‌కు తరలించారు. బాధితుడి తలకు, చేతికి తీవ్రగాయాలయ్యాయి. అయితే దాడి విషయంలోనే చిన్న గందరగోళం నెలకొందని డీఎస్పీ నాగప్ప చెబుతున్నారు. అతనిని బోనులోకి పడేశారా? లేక కుక్కలనే అతని మీదకు ఉసిగొల్పరా? అన్నది తేలాల్సి ఉందని ఆయన అంటున్నారు. అది తేలితేగానీ నిందితులపై చర్యలు తీసుకోలేమని నాగప్ప స్పష్టం చేశారు. -
వీహెచ్‌పీ కార్యకర్త మృతి
బెంగళూరు: కర్ణాటకలోని మడికెరిలో టిప్పు సుల్తాన్ జయంతి ఉత్సవాలలో మంగళవారం హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఉత్సవాలకు వ్యతిరేకంగా వీహెచ్‌పీ కార్యక్తలు ఆందోళనకు దిగారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. ఆ క్రమంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. రాళ్ల దాడిలో వీహెచ్‌పీ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అతడు మరణించాడు. స్థానికంగా ఇరువర్గాల వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులను మొహరించారు.