మడికెరిలో చిక్కుకున్న తన కుటుంబాన్ని తక్షణం రక్షించాలని కన్నడనటి దిశా వూవయ్య శనివారం సీఎం కుమారస్వామికి విజప్తి చేశారు. 8 మంది కుటుంసభ్యులు బయటకు రావడానికి వీలుకాక ఇంటిలో ఉన్నారని, వారిలో ఒక గర్భిణి కూడా ఉన్నట్లు ఆమె సీఎంతో విన్నవించారు. తక్షణం ఆమెకు వైద్య సహాయం కూడా చేయాలన్నారు. అదే ప్రాంతంలో 40 మంది వరదలో చిక్కుకున్నట్లు తెలిపారు. సీఎం సహాయక చర్యలకు ఆదేశించారు.
రోజుల తరబడి సూర్యుని ముఖం చూడలేదు. నిరంతరం వర్షమే. ఇల్లు, వీధి అనే తేడాలేకుండా ఎక్కడ చూసినా నీళ్లేనీళ్లు. అయినా తాగడానికి నీళ్లు లేవు. తినడానికి తిండి లేదు, ఉండడానికి చోటు లేదు. ఇదీ వరదబాధిత కొడగులో జనం దీనావస్థ
సాక్షి, బెంగళూరు: కరావళి, మలెనాడు ప్రాంతాలు వరద గుప్పిట్లో విలవిలాడుతున్నాయి. సుమారు 12 రోజులుగా కుంభవృష్టి కొడగు, దక్షిణ కన్నడ, ఉడుపి, హాసన్, చిక్కమగళూరు, చామరాజనగర, శివమొగ్గ తదితర జిల్లాలను వణికిస్తోంది. కొడగు అత్యధికంగా నష్టపోయింది. జిల్లాలో ఇప్పటికి ఆరుగురు మరణించగా, సుమారు 100 మంది ఆచూకీ తెలియడం లేదు. వర్షాల ప్రభావంతో కొడగు జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. సైన్యం రంగంలోకి దిగింది. హెలికాప్టర్ల ద్వారా వర్షబాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిల్లో పడ్డారు. కొడగు, చామరాజనగర, మంగళూరు, మండ్య, హాసన్ జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో ప్రజలు భయం భయంగా గడుపుతున్నారు.
చిక్కుకుపోయిన బాధితులు
♦ కొడగు జిల్లాలో హెమ్మెతాళు, మేఘతాళు, కాలూరు గ్రామాల్లో కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో సుమా రు 500 మంది చిక్కుకుపోయారు.
♦ మంగళూరు – మడికెరి రహదారిలో కొండ విరిగిపడడంతో 200 మంది పైగా చిక్కుకున్నారు. దీనికి తోడు అన్ని ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో ప్రజలకు పలు చోట్ల ఆశ్రయాలు ఏర్పాటు చేశారు. వరదల్లో ఇరుక్కున్నవారిని రక్షించడానికి ఆర్మీ, ఎన్‌డీఆర్‌ఎఫ్ ద్వారా చర్యలు చేపట్టారు.
♦ రామ, లక్ష్మణ తీర్థనదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.
♦ 150 మంది కేఆఎస్ ఆర్టీసీ సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మూడు ఐరావత బస్సులను బాధితుల సౌకర్యార్థం ఉచితంగా కేటాయించారు. కేరళ పాలఘాట్ నుంచి మంగళూరు వరకు ప్రయాణికులు ఆ బస్సుల గుండా ఉచితంగా చేరుకోవచ్చు.
కావేరి తీరంలో అలజడి
కే ఆర్‌ఎస్ జలాశయంలోకి లక్ష క్యూసెక్కుల నీరు చేరింది. ఫలితంగా మండ్య, చామరాజనగర ప్రాంతాలతో పాటు కావేరి నదీ తీర ప్రాంతంలో జనాలు భయంభయంగా జీవనం సాగిస్తున్నారు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అని గుబులు నెలకొంది. ఐదురోజుల నుంచీ నదీ తీరంలోని దేవస్థానాలు, నివాసాలు జలావృతమయ్యాయి. నదీ తీరవాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
మంత్రుల పర్యటన
కొడగు జిల్లాలో ఇప్పటి వరకు సుమారు మూడువేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా ఆరు వందల మంది రక్షణ కోసం ఎదురు చూస్తున్నారు. వరద పీడిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి డీవీ సదానందగౌడ, రాష్ట్రమంత్రులు ఆర్‌వీ దేశపాండే, జీటీ దేవెగౌడ, సా.రా.మహేశ్, ఎన్.మహేశ్ తదితరులు సందర్శించి సాయం అందజేస్తామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment