
‘కాన్పు కోసం వెళితే కిడ్నీ కాజేశారు’
రోగులకు తెలియకుండా మూత్రపిండాలు దొంగిలిస్తున్న ఉదంతాలు రోజుకు రోజుకు పెరుగుతున్నాయి.
బారీల్లి: రోగులకు తెలియకుండా మూత్రపిండాలు దొంగిలిస్తున్న ఉదంతాలు రోజుకు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఉదంతం ఉత్తరప్రదేశ్ లోని బారీల్లి నగరంలో వెలుగులోకి వచ్చింది. కాన్పు కోసం ఆస్పత్రికి వెళితే తన కిడ్నీ కాజేశారని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నారాయణి అనే మహిళ ప్రసవం కోసం మార్చి నెలలో రోహిత్ అగ్నిహోత్రి ఆస్పత్రిలో చేరింది. తన కిడ్నీ తొలగించినట్టు డిశ్చార్జి అయిన గుర్తించానని పోలీసులకు తెలిపింది.
అయితే ఈ ఆరోపణలను ఆస్పత్రి యజమాని డాక్టర్ సుష్మా అగ్నిహోత్రి తోసిపుచ్చారు. 30 నిమిషాలు ఆపరేషన్ లో కిడ్నీ తొలగించడం అసాధ్యమని అన్నారు. నారాయణి అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీయించుకోలేదని, కాన్పుకు ముందు ఆమెకు రెండు కిడ్నీలు ఉన్నట్టు ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఇదంతా తమ ప్రత్యర్థుల కుట్రని సుష్మ ఆరోపించారు. పోలీసులు ఈ కేసును చీఫ్ మెడికల్ అధికారికి నివేదించారు.