
మోడీ కోసం ఒబామా ఎదురుచూపు!
ప్రధానితో భేటీలో అమెరికా మంత్రుల వెల్లడి
ప్రపంచ సవాళ్ల పరిష్కారమే తమ ధ్యేయం అన్న మోడీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీతో వచ్చే సెప్టెంబర్‌లో జరగనున్న శిఖరాగ్ర సమావేశంకోసం ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఎదురుచూస్తున్నారని, ద్వైపాక్షిక సంబంధాలను కొత్త పంథాలో సాగించేందుకు బృహత్తరమైన ఎజెండాతో సిద్ధపడుతున్నారని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, వాణిజ్య శాఖ మంత్రి పెన్నీ ప్రిజ్ట్‌కర్ చెప్పారు. ఢిల్లీలో ప్రధాని మోడీతో శుక్రవారం గంటసేపు జరిపిన సమావేశంలో వారీ విషయం చెప్పారు. కాగా, ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టపడేలా, ఈ సమావేశం ద్వారా నిర్దిష్ట ప్రయోజనాలు సాధించేందుకు ఉభయదేశాలు సిద్ధపడాలని మోడీ సూచించారు. దార్శనికత, వ్యూహం, కార్యాచరణ ప్రణాళిక ప్రాతిపదికలుగా ఈ విషయంలో ముందుకు సాగాలని మోడీ సూచించారు.
గురువారం భారత్, అమెరికాల మధ్య జరిగిన వ్యూహాత్మక చర్చల వివరాలను కూడా అమెరికా ఇద్దరు మంత్రులు మోడీకి వివరించారు. భారత్‌తో ద్వైపాక్షిక సహకారానికి, అంతర్జాతీయ అంశాల్లో భారత్‌తో భాగస్వామ్యానికి ఒబామా పూర్తి ప్రాధాన్యం ఇస్తున్నట్టు వారు చెప్పారు. సెప్టెంబర్‌లో మోడీతో జరగబోయే భేటీనుంచి పూర్తిస్థాయి ఫలితాలను ఒబామా ఆశిస్తున్నట్టు వారు చెప్పారు. మోడీతో అమెరికా మంత్రులు జరిపిన సమావేశం వివరాలను ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రపంచ సవాళ్ల పరిష్కారం, శాంతి స్థిరత్వాలకు ప్రోత్సాహం వంటి లక్ష్యాల సాధనకు భారత్, అమెరికాలు భాగస్వామ్యంతో కలసి పనిచేయాలని మోడీ సూచించారు. వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, నైపుణ్యాల అభివృద్ధి, ఆగ్రో ప్రాసెసింగ్, యువతకు ఉపాధి తదితర అంశాల్లో ఉభయదేశాల భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని కూడా మోడీ కోరారు. ఆసియా పసిఫిక్, దక్షిణాసియా ప్రాంతంలో భారత్ పాత్రను కూడా మోడీ ప్రస్తావించారు.
వైట్‌హౌస్ ప్రకటన: భారత్‌తో పటిష్టమైన సంబంధాలకు అధిక ప్రాధాన్యత ఉందని ఒబామా గుర్తించినట్టు అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ ప్రకటించింది. ఉభయదేశాల సంబంధాలు బహుముఖమైనవిగా ఉండాలని, జాతీయ భద్రతా సంబంధాలుగా కొనసాగాలని ఒబామా అభిలషిస్తున్నట్టు కూడా వైట్‌హౌస్ పేర్కొంది.
‘వాణిజ్య చర్చల వైఫల్యానికి కారణం భారత్’
వాషింగ్టన్ : వాణిజ్య సౌలభ్య ఒప్పందం (టీఎఫ్‌ఏ)పై జరిగిన చర్చల వైఫల్యానికి భారత్ కారణమని, భారత్ పిడివాద వైఖరివల్ల ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీఓ) భవితవ్యమే అనిశ్చితంగా మారుతోందని అమెరికా ఆరోపించింది. వాణిజ్య సౌలభ్య ఒప్పందం అమలుకు కట్టుబడరాదని భారత్ సహా డబ్ల్యుటీఓలోని కొన్ని సభ్యదేశాలు నిర్ణయం తీసుకున్నాయని, ఈ వైఖరి ఆందోళకరమని అమెరికా ఒక ప్రకనటలో విమర్శించింది
.
అయితే, వాణిజ్య సౌలభ్య ఒప్పందానికి తాము కట్టుబడి ఉన్నామని, అయితే, ఆ ఒప్పందానికి ముందు ఆహార భద్రతాపరమైన సమస్యలకు శాశ్వత ప్రాతిపదికన పరిష్కారం లభించేవరకూ తమ ప్రతిపాదనలపై అంగీకారంకోసం కృషిచేస్తామని భారత్ పేర్కొంది. డబ్ల్యుటీఓకు నెలరోజులపాటు విరామం కాబట్టి, సమస్య పరిష్కారానికి తదుపరి చర్యలపై భారత్ దృష్టిని కేంద్రీకరిస్తుందని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి రాజీవ్ ఖేర్ ఢిల్లీలో వ్యాఖ్యానించారు.
కాగా, ఆహార నిల్వల సమస్యకు ఒక పరిష్కారం లభించేవరకూ టీఎఫ్‌ఏపై ఒప్పందాన్ని ఆమోదించరాదన్నది భారత్ వాదనగా ఉందని, ఆహార భద్రతా ప్రయోజనాలకోసం దృష్టిలో పెట్టుకునే భారత్ ఈ వైఖరి కనబరుస్తోందని అమెరికా వాణిజ్య ప్రతినిధి మైక్ ఫ్రోమాన్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. డబ్ల్యుటీఓలో రూపుదిద్దుకున్న బహుళదేశీయ వాణిజ్య వ్యవస్థకు అమెరికా పూర్తిగా కట్టుబడి ఉందని, అయితే, అంగీకారం కుదిరిన ఒప్పందం అమలుకావాలంటే డబ్ల్యుటీఓలోని సభ్యదేశాల ఆమోదం అవసరమని ఫ్రోమాన్ పేర్కొన్నారు. వాణిజ్య సౌలభ్య ఒప్పందం చర్చల వైఫల్యంపట్ల ఆయన తీవ్ర ఆసంతృప్తి వ్యక్తంచేశారు. తాజా పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై తమ వాణిజ్య భాగస్వామ్యదేశాలతో కలసి చర్చిస్తామన్నారు.