ఉగ్ర నిర్మూలనకు అవకాశం
అమెరికా సాయంతో ముందడుగు: సుష్మ స్వరాజ్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతమొందించడానికి విస్తృతమైన అవకాశం ఉందని.. అయితే ఇందుకు మరింత సహకారం అవసరమని భారత్ అభిప్రాయపడింది. భారత్-అమెరికా మధ్య రెండో వ్యూహాత్మక వాణిజ్య చర్చలు (ఎస్ అండ్ సీడీ) మంగళవారమిక్కడ జరిగాయి. ఇరు దేశాల విదేశాంగ మంత్రులు సుష్మాస్వరాజ్, జాన్ కెర్రీ, వాణిజ్య శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్, పెన్నీ ప్రిజ్‌కర్ ఇందులో పాల్గొన్నారు. ఉగ్రవాద నియంత్రణతో పాటు ఇంధన, వాణిజ్య అంశాలపై చర్చించారు.
ప్రపంచానికి పెను సవాలుగా మారిన ఉగ్రవాదాన్ని తుదముట్టించవచ్చని.. అయితే ఇందుకు మరింత సహకారం అవసరమని సుష్మా తెలిపారు. ద్వైపాక్షిక వ్యాపార సంబంధాలు బలపడాలంటే కంపెనీల ఆకాంక్షలు, ఆసక్తులను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. అలాగే అణు సరఫరా బృందం (ఎన్‌ఎస్‌జీ)లో సభ్యత్వం, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందేందుకు అమెరికాతో కలిసి ముందుకు సాగుతామన్నారు.
సైబర్ ముప్పు నుంచి రక్షించుకొనేందుకు తొలిసారిగా అమెరికాతో కలిసి రూపొందించనున్న కార్యాచరణ తుది రూపునకు వచ్చిందన్నారు. రక్షణ, ఇంధన, సైబర్ భద్రత రంగాల్లో ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడ్డాయని కెర్రీ చెప్పారు. భారత్‌లోని ఇళ్లకు విద్యుత్ సరఫరా అందించే దిశగా పౌర అణు ఇంధన రియాక్టర్లు నెలకొల్పేందుకు సహకారం అవసరమన్నారు.