జాన్ కెర్రీ ఇండియాకు ఎందుకొచ్చారంటే!
న్యూఢిల్లీ: అమెరికా విదేశాంగమంత్రి జాన్ కెర్రీకి తాజా భారత పర్యటన కొంత చికాకు తెప్పించి ఉండవచ్చు. ఎందుకంటే ఆయన సోమవారం రాత్రి న్యూఢిల్లీలో అడుగుపెట్టగానే భారీ వర్షం పలుకరించింది. హస్తినలో భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఆ ట్రాఫిక్‌లో సాక్షాత్తు జాన్ కెర్రీ చిక్కుకుపోయారు. దీంతో ఆయన చికాకు పడ్డారో లేదో తెలియదు కానీ ఆయన వెంట ఉన్న మీడియా ప్రతినిధులు మాత్రం తమ చిరాకునంతా ట్విట్టర్‌లో వెళ్లగక్కారు. మంగళవారానికి అంతా సర్దుకుంది. భారత్‌తో అత్యంత కీలకమైన రక్షణశాఖ ఒప్పందాలను అమెరికా కుదుర్చుకుంది. ఆ టాప్ వివరాలు మీకోసం..
-
భారత్-అమెరికా మధ్య 'వ్యూహాత్మక-వాణిజ్య సంబంధాలను' పెంపొందించేందుకు ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆరంభించిన చర్చలను ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో జాన్ కెర్రీ ఢిల్లీలో అడుగుపెట్టారు.
-
ఆయన బుధవారం ప్రధాని మోదీతో సమావేశమవుతారు. అమెరికా-భారత్ వాణిజ్యాన్ని ఐదురెట్లు పెంచి 500 బిలియన్ డాలర్ల (రూ. 33.52 లక్షల కోట్ల)కు చేర్చే లక్ష్యంతో వీరి మధ్య చర్చలు జరగనున్నాయి.
-
జాన్‌కెర్రీ మంగళవారం విదేశాంగమంత్రి సుష్మాసర్వాజ్‌ను కలిశారు. సాయంత్రం కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అవుతారు.
-
మరమ్మతులు, సరఫరాల కోసం ఇరుదేశాల సైనిక శిబిరాలు పరస్పరం ఉపయోగించుకునేందుకు అనుమతిస్తూ వాషింగ్టన్‌లో అమెరికా-భారత్ ఒక ఒప్పందంపై సంతకం చేసిన నేపథ్యంలో జాన్‌కెర్రీ భారత పర్యటనకు వచ్చారు.
-
చైనా తన సైనిక శక్తిని అమేయంగా పెంచుకుంటున్న నేపథ్యంలో దానిని దీటుగా ఎదుర్కొనేందుకు రక్షణ బంధాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు రక్షణమంత్రి మనోహర్ పరీకర్, అమెరికా రక్షణమంత్రి ఆష్టన్ కార్టర్‌తో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
-
ఇరుదేశాల సంయుక్తంగా, వ్యూహాత్మకంగా ఆర్మీ కార్యకలాపాలు చేపట్టేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని కార్టర్ పేర్కొనగా.. ఈ ఒప్పందం వల్ల భారత భూభాగంలో అమెరికా సైనిక శిబిరాలు ఏర్పాటుచేసేందుకు వీలు ఉండబోదని మనోహర్ పరీకర్ స్పష్టం చేశారు.
-
జాన్ కెర్రీ భారత్‌లో పర్యటించడం ఇది నాలుగోసారి. ఆయన బుధవారం ఢిల్లీ ఐఐటీలో విద్యార్థుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వనున్నారు.
- కెర్రీ పర్యటన నేపథ్యంలో అణు సరఫరాల గ్రూప్ (ఎన్‌ఎస్‌జీ), 48 దేశాల బృందం (జీ 48)లో స్వభ్యత్వం కోసం అమెరికా మద్దతును భారత్ మరింత బలంగా కోరే అవకాశముంది.