తండ్రిని మోసం చేసిన కొడుక్కి కోర్టు ఝలక్
పాటియాల: కన్నతండ్రిని మోసం చేసిన ఓ కుమారుడు అతడి భార్యకు పంజాబ్లోని ఓ కోర్టు తగిన బుద్ది చెప్పింది. మాయమాటలు చెప్పి, బంగారంలా చూసుకుంటామని నమ్మబలికించి వారికున్న పొలాన్ని తమ పేరుమీదకు మార్పించుకుని ఆ తర్వాత తల్లిదండ్రులను వెళ్లగొట్టిన ఆ ప్రబుద్ధులకు తగిన శాస్తి చేసింది. ఆ పొలాన్ని తిరిగి ఆ వృద్ధ దంపతుల పేరుమీదకు మార్చాలని చెప్పింది. దీంతో చకచకా ఆ మండల అధికారి ఆ పనులు పూర్తి చేయడంతో ఆ కపట తనయుడు, కోడలు నోరెళ్లబెట్టారు.
వివరాల్లోకి వెళితే.. పంజాబ్ లోని టర్కియానా గ్రామంలో జోగిందర్ సింగ్ (80) అనే పెద్దాయనకు మల్కిత్ సింగ్ అనే కుమారుడు ఉన్నాడు. వారికి ఐదున్నర ఎకరాల భూమి ఉంది. అయితే, వృద్ధులైన ఆ తల్లిదండ్రులను కుమారుడు, కోడలు కలిసి నమ్మబలికించి మొత్తం పొలాన్ని రాయించుకున్నారు. అనంతరం అప్పుడే నిర్మించుకున్న కొత్త ఇంట్లో నుంచి గెంటేశారు. వెంటనే ఊర్లోకి వెళ్లిపోవాలని, అక్కడ ఉన్న పాత ఇంట్లో ఉండాలని చెప్పారు. తల్లిదండ్రులు కావడంతో తలదించుకొని అతడి మాట ప్రకారం ఊరెళ్లారు. అయితే, అక్కడికి వెళ్లిన తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీంతో వృద్ధుడైన జోగిందర్ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్(ఎస్డీఎం) బజిందర్ సింగ్ సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం వారి సంక్షేమం దృష్ట్యా ఆ కుమారుడి చేతిలోకి వెళ్లిన పొలాన్ని తిరిగి ఆ వృద్ధ దంపతులకు కేటాయించారు.