తెలంగాణకు అండగా ఉండండి.. | Be the supported to Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణకు అండగా ఉండండి..

Published Wed, Nov 30 2016 3:35 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

తెలంగాణకు అండగా ఉండండి.. - Sakshi

తెలంగాణకు అండగా ఉండండి..

- కేంద్ర మంత్రులను కోరిన తెలంగాణ బీజేపీ నేతలు
- డబుల్ బెడ్రూం ఇళ్ల మంజూరులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
- కేంద్ర ఇచ్చే నిధులను కూడా వినియోగించడం లేదు: కె.లక్ష్మణ్
 
 సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ అభివృద్ధికి అన్ని విధాలుగా సాయపడాలని కేంద్ర మంత్రులకు రాష్ట్ర బీజేపీ నేతలు విజ్ఞప్తి చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు నేతృత్వంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, శాసనసభాపక్ష నేత కిషన్‌రెడ్డి, ఉప నేత చింతల రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి తదితరులు మంగళవారం ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. సమావేశ వివరాలను బీజేపీ కేంద్ర కార్యాలయంలో కె.లక్ష్మణ్ మీడియాకు వెల్లడించారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాశ్‌జవదేకర్‌లో సమావేశమై.. రాష్ట్రంలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, మధ్యాహ్న భోజన పథకాన్ని ఇంటర్ వరకు కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు.

తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు, జిల్లాల పునర్విభజన జరగడంతో జిల్లాకు ఒకటి చొప్పున నవోదయ, కస్తూర్బా విద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరామన్నారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్టు లక్ష్మణ్ తెలిపారు. అనంతరం కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడితో సమావేశమయ్యామని చెప్పారు. మున్సిపాలిటీ, పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం ఇప్పటికే 90 వేల ఇళ్లు మంజూరు చేయడంతోపాటు, హడ్కో నుంచి రూ.3,300 కోట్లు రుణం మంజూరు చేసిందని వివరించారు.

 కేసీఆర్ ప్రకటన సరికాదు: తెలంగాణలో పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని చెప్పి.. ఇప్పుడు నిర్మించలేకపోతున్నామని సీఎం కేసీఆర్ ప్రకటన చేయడం సరికాదని, దీన్ని తాము తీవ్రంగా తప్పుబడుతున్నామని లక్ష్మణ్ చెప్పారు. ఇళ్ల మంజూరు, నిధుల విడుదలలో కేంద్రం అన్ని విధాలుగా సహకరిస్తున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలస్యం చేస్తున్నారని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన విమర్శించారు. ఇళ్ల మంజూరును వేగవంతం చేయాలని వెంకయ్యను కోరామన్నారు. అలాగే తెలంగాణలో ఆయుర్వేదిక్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరగా.. దీనిపై వెంకయ్య.. కేంద్ర ఆయూష్ శాఖ మంత్రి శ్రీపాద్‌నాయక్‌తో చర్చించారు. దీనికి శ్రీపాద్‌నాయక్ సూత్రపాయంగా అంగీకరించినట్టు తెలిపారు.

 తెలంగాణలో ఎరుుమ్స్ ఏర్పాటు చేయండి: తెలంగాణలో ఎరుుమ్స్ ఏర్పాటు చేయాలని, నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, జాతీయ రహదారుల వెంట ట్రామాకేర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాను రాష్ట్ర బీజేపీ నేతలు కోరారు. ఉత్తర-దక్షిణ తెలంగాణలో ఒకటి చొప్పున సూపర్ స్పెషాలిటీ కేన్సర్, కంటి ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్‌లో పసుపు పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర వ్యవసాయ మంత్రి రాధామోహన్‌సింగ్‌ను కోరారు.

 పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయాలని రైల్వే మంత్రి సురేశ్‌ప్రభును బీజేపీ నేతలు కోరారు. దీనిపై సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటానని సురేశ్‌ప్రభు హామీ ఇచ్చినట్టు కె.లక్ష్మణ్ తెలిపారు. కేంద్ర వాణిజ్య మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశమై కర్నూలు-హైదరాబాద్, ఆదిలాబాద్-నాగ్‌పూర్ జాతీయ రహదారులను ఇండస్ట్రియల్ కారిడార్‌గా గుర్తించాలని కోరారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement