కావాలంటే నన్ను కొట్టండి: కేజ్రీవాల్
ఎప్పుడూ అవకాశం వస్తే కేంద్రం మీద విరుచుకుపడే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అదే రాగంలో సరికొత్త పల్లవి అందుకున్నారు. ప్రధానమంత్రి మోదీకి రెండు చేతులు జోడించి వేడుకుంటున్నానని, కావాలంటే తనతో దెబ్బలాడాలని.. ఇంకా కావాలంటే తనను కొట్టాలని, అంతేతప్ప ఢిల్లీ ప్రజలను వేధించొద్దని అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న మంచి పనులు ఆపేందుకు ప్రయత్నించొద్దని ఆయన కోరారు. ఢిల్లీ ప్రభుత్వం నియమించిన 21 మంది పార్లమెంటరీ సెక్రటరీలు తమ కళ్లు, చెవులు, చేతులని ఆయన చెప్పారు. వాళ్ల సాయంతోనే ప్రభుత్వం నడుస్తోందని, అభివృద్ధి పనులు జరగడానికి వీళ్లు చాలా కృషి చేస్తారని కేజ్రీవాల్ అన్నారు.
అయితే.. తమ ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించడాన్ని బీజేపీ, కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నాయని, వాళ్లు ఢిల్లీని పాలించినప్పుడు అలాగే చేశారని చెప్పారు. సాహిబ్ సింగ్ వర్మ దగ్గర నుంచి షీలా దీక్షిత్ వరకు అందరూ ఇలాగే చేశారని ఉదాహరణలు కూడా వివరించారు. వాళ్లు చేస్తున్న అదనపు పనులకు వాళ్లకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వడం లేదని, అందువల్ల వారి పదవులు ఊడగొట్టించేందుకు ప్రయత్నాలు చేయొద్దని కోరారు. అయితే.. తాను చెప్పదలచుకున్నది చెప్పేసిన తర్వాత.. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేసేలోపే ముఖ్యమంత్రి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు.