parliamentary secretaries
-
రేవంత్ పిటిషన్‌పై కీలక విచారణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పలువురికి కేబినెట్ హోదానిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు వివరణ కోరింది. ఈ వ్యవహారంపై మార్చి 14 నాటికి పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని, మరోసారి గడువునిచ్చే ప్రసక్తే లేదని ప్రభుత్వానికి తేల్చి చెప్పింది. కేబినెట్ హోదా పొందిన వారిలో నోటీసులు అందని వారికి వ్యక్తిగతంగా మళ్లీ నోటీసులిచ్చే వెసులుబాటును పిటిషనర్ రేవంత్‌రెడ్డికి కల్పించింది. తదుపరి విచారణను మార్చి 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ పదవులూ లాభదాయకమే..: పిటిషనర్ ఇ.బాలకిషన్, ఆర్.విద్యాసాగర్‌రావు, ఎ.కె.గోయల్, ఆర్.రామలక్ష్మణ్, బి.వి.పాపారావు, కె.వి.రమణాచారి, జీఆర్‌రెడ్డి, దేవులపల్లి ప్రభాకర్‌రావు, పేర్వారం రాములు, ఎస్.వేణుగోపాలాచారి, రామచంద్రు తెజావత్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సోమారపు సత్యనారాయణ, పిడమర్తి రవి, జి.వివేకానంద, వి.ప్రశాంత్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్ తదితరులకు ప్రభుత్వం కేబినెట్ హోదా కల్పించడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి గతేడాది జనవరిలో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పార్లమెంటరీ కార్యదర్శులుగా లాభదాయక పదవులు అనుభవిస్తున్న 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న ఎన్నికల సంఘం సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో కేబినెట్ హోదా కూడా లాభదాయకమేనని, కాబట్టి ఈ వ్యాజ్యంపై త్వరగా విచారించాలని ఇటీవల రేవంత్ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిల ధర్మాసనం ఇటీవల పిటిషన్‌ను విచారణ జరిపింది. ప్రభుత్వం కాలయాపన చేస్తోంది న్యాయవాదిగా ఉన్నపుడు వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న వారిలో ఒకరి తరఫున జస్టిస్ విజయలక్ష్మి వకాలత్ దాఖలు చేయడంతో కేసును విచారించేందుకు ఆమె విముఖత చూపారు. దీంతో జస్టిస్ రామసుబ్రమణియన్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు బుధవారం వ్యాజ్యం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫు న్యాయవాది రజనీకాంత్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగంలోని అధికరణ 164 (1ఎ) ప్రకారం ముఖ్యమంత్రితో సహా మంత్రులు 15 శాతానికి మించడానికి వీల్లేదన్నారు. కావాల్సిన వారికి కేబినెట్ హోదా ఇచ్చేందుకు రాజ్యాంగ నిబంధనలు అంగీకరించవని, అయినా ప్రభుత్వం ఇష్టమొచ్చిన వారికి కేబినెట్ హోదానిచ్చిందని తెలిపారు. వ్యాజ్యంపై కౌంటర్ దాఖలు చేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. ‘20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై ఆనర్హత వేటు’విషయాన్ని ఈ సందర్భంగా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. -
ఢిల్లీ ఎమ్మెల్యేలపై వేటుతో ఓరుగల్లులో గుబులు
సాక్షి ప్రతినిధి, వరంగల్: పార్లమెంటరీ కార్యదర్శి పోస్టు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వంతో ఈ పదవులు చేపట్టిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ప్రభావం వరంగల్ ఉమ్మడి జిల్లాలోనూ చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటరీ కార్యదర్శి పదవులు నిర్వహించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటనేది రాజకీయవర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. 2014 సాధారణ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత మంత్రివర్గం కొలువుదీరింది. మంత్రివర్గ సంఖ్యకు పరిమితి ఉండడంతో పలువురికి పార్లమెంటరీకార్యదర్శి పోస్టులను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. రాష్ట్రం లో ఆరుగురు ఎమ్మెల్యేను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించింది. ప్రస్తుతం వరంగల్ అర్బన్ జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌బాబుకు పార్లమెంటు కార్యదర్శి పదవులు దక్కాయి. రా జ్యంగ విరుద్ధంగా ఈ పదవువులను ఇచ్చారంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి. పదవులు రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటరీ కార్యదర్శి పదవులు రద్దు చేసింది. ఈసీ నిర్ణయంతో... ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్ పార్టీ ప్రభుత్వంలో 20 మంది ఎమ్మెల్యేలు పార్లమెంటరీ కార్యదర్శి హోదాలో కొనసాగి లాభదాయ పదవి నిర్వహించారనే అభియోగంపై వీరి శాసనసభ సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈసీ గడప తొక్కేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో గతంలో పార్లమెంటరీ కార్యదర్శి పదవిలో కొనసాగిన ఆరుగురు ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. సోమవారం ఈ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పార్లమెంటరీ కార్యదర్శి పదవులు నిర్వహించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. మన రాష్ట్రంలో పార్లమెంటరీ కార్యదర్శి పదవి నిర్వహించిన ఎమ్మెల్యేలు ఢిల్లీ ఎమ్మెల్యేలపై వచ్చిన నిర్ణయంతో ఆందోళన చెందుతున్నారు. దాస్యం వినయ్ భాస్కర్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో మంత్రి పదవి వస్తుందని ఆశించారు. వివిధ సమీకరణల వల్ల మంత్రి పదవి దక్కలేదు. ఆ తర్వాత పార్లమెంటు కార్యదర్శి పదవి చేపట్టినా ఎక్కువ కాలం లేదు. మరోవైపు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వొడితెల సతీశ్‌బాబుకు పార్లమెంటరీ కార్యదర్శి పదవి చేపట్టారు. కొద్దిరోజులకే ఈ పదవికి దూరమయ్యారు. తాజాగా కాంగ్రెస్ తీసుకుంటున్న రాజకీయ నిర్ణయంతో వీరిద్దరికి ఎలాంటి పరిస్థితి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది. -
కేజ్రీవాల్ సర్కారుకు దెబ్బమీద దెబ్బ
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ సర్కారుకు దెబ్బమీద దెబ్బ తగులుతున్నాయి. మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు కేసుల్లో ఇరుక్కోవడంతో ఇంటాబయటా విమర్శపాలైన కేజ్రీవాల్ ప్రభుత్వానికి హైకోర్టులోనూ చుక్కెదురైంది. 21 మంది పార్లమెంటరీ కార్యదర్శుల నియామకంను ఉన్నత న్యాయస్థానం గురువారం రద్దు చేసింది. పార్లమెంటరీ సెక్రటరీల నియామకం బిల్లుపై సంతకం చేసేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి జూన్‌లో నిరాకరించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లాభదాయక పదవులు చేపట్టడం రాజ్యంగ ఉల్లంఘన కిందకు వస్తుంది. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాలను అంతకుముందు కోర్టులో కేజ్రీవాల్ సర్కారు సమర్థించుకుంది. పార్లమెంటరీ సెక్రటరీలకు ప్రభుత్వం ఎటువంటి వేతనాలు చెల్లించదని తెలిపింది. అధికారిక కార్యకలాపాలకు మాత్రమే ప్రభుత్వ వాహనాలను వినియోగిస్తారని వెల్లడించింది. మంత్రుల కార్యాలయాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తారని చెప్పింది. ప్రభుత్వం వాదనలతో ఏకీభవించని హైకోర్టు పార్లమెంటరీ కార్యదర్శుల నియామకంను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. -
కావాలంటే నన్ను కొట్టండి: కేజ్రీవాల్
ఎప్పుడూ అవకాశం వస్తే కేంద్రం మీద విరుచుకుపడే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అదే రాగంలో సరికొత్త పల్లవి అందుకున్నారు. ప్రధానమంత్రి మోదీకి రెండు చేతులు జోడించి వేడుకుంటున్నానని, కావాలంటే తనతో దెబ్బలాడాలని.. ఇంకా కావాలంటే తనను కొట్టాలని, అంతేతప్ప ఢిల్లీ ప్రజలను వేధించొద్దని అన్నారు. ఢిల్లీలో జరుగుతున్న మంచి పనులు ఆపేందుకు ప్రయత్నించొద్దని ఆయన కోరారు. ఢిల్లీ ప్రభుత్వం నియమించిన 21 మంది పార్లమెంటరీ సెక్రటరీలు తమ కళ్లు, చెవులు, చేతులని ఆయన చెప్పారు. వాళ్ల సాయంతోనే ప్రభుత్వం నడుస్తోందని, అభివృద్ధి పనులు జరగడానికి వీళ్లు చాలా కృషి చేస్తారని కేజ్రీవాల్ అన్నారు. అయితే.. తమ ఎమ్మెల్యేలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించడాన్ని బీజేపీ, కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నాయని, వాళ్లు ఢిల్లీని పాలించినప్పుడు అలాగే చేశారని చెప్పారు. సాహిబ్ సింగ్ వర్మ దగ్గర నుంచి షీలా దీక్షిత్ వరకు అందరూ ఇలాగే చేశారని ఉదాహరణలు కూడా వివరించారు. వాళ్లు చేస్తున్న అదనపు పనులకు వాళ్లకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వడం లేదని, అందువల్ల వారి పదవులు ఊడగొట్టించేందుకు ప్రయత్నాలు చేయొద్దని కోరారు. అయితే.. తాను చెప్పదలచుకున్నది చెప్పేసిన తర్వాత.. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేసేలోపే ముఖ్యమంత్రి అక్కడి నుంచి లేచి వెళ్లిపోయారు. -
ఆప్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: ఇప్పటికే లెఫ్టినెంట్ గవర్నర్‌తో వివాదంలో తలమునకలై తీరిక లేకుండా ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి మరొక కష్టమొచ్చిపడింది. ఢిల్లీ హైకోర్టు ఆపార్టీకి నోటీసులు పంపించింది. తన పార్టీ నుంచి 21 మందిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ వేయడంతో దానిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆప్ ను ఆదేశించింది. అయితే, తదుపరి విచారణ జరిగే జూన్ 1నాటికి వివరణ ఇవ్వాలని కోరిన కోర్టు.. ఆయన చేసిన నియామకాలపై మాత్రం స్టే విధించలేదు. ఈ ఏడాది మార్చి 13న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వీరి నియామకం చేశారు. రాష్ట్రీయ ముక్తి మోర్చా అనే సంస్థ ఢిల్లీ హైకోర్టులో ఈ నియామకాలకు సంబంధించి పిటిషన్ వేసింది. -
పార్లమెంటరీ సెక్రటరీలను రద్దు చేయండి: హైకోర్టు
-
ఆప్ పార్లమెంటరీ సెక్రటరీల నియామకంపై విచారణ
ఈ నెల 20న విచారణ జరుపనున్నట్లు తెలిపిన హైకోర్టు 21 మందిని పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించడం రాజ్యాంగ విరుద్ధమన్న పిల్ సాక్షి, న్యూఢిల్లీ: అర్వింద్ కేజ్రీవాల్ సర్కారు 21 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 20న విచారణ జరపనున్నట్లు ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఇంత మందిని పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించడంలో చట్టబద్ధతను, రాజ్యాంగ ఔచిత్యాన్ని సవాలుచేస్తూ రాష్ట్రీయ ముక్తి మోర్చా అనే ఎన్జీఓ ప్రజా ప్రయోజనవ్యాజ్యం దాఖలు చేసింది. సీఎంఅర్వింద్ కేజ్రీవాల్, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమితులైన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఈ పిటిషన్ దాఖలైంది. పార్లమెంటరీ సెక్రటరీల నియామకాన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్‌పై మే 20న విచారణ జరపనున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జి.రోహిణి, న్యాయమూర్తి ఆర్.ఎస్. ఎండ్లాతో కూడిన ధర్మాసనం పేర్కొంది. 21 మంది ఆప్ ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించి వారిని విభిన్న మంత్రిత్వశాఖలకు అనుసంధానిస్తూ ఆప్ సర్కారు ఏప్రిల్ 13న ఉత్తర్వు జారీ చేసింది. వీళ్లు ఎలాంటి వేతన, భత్యాలు లేకుండా పనిచేస్తారని, వారి వల్ల ప్రభుత్వ ఖజానాపై ఎలాంటి భారం పడబోదని, వారి నియామకం వల్ల ప్రభుత్వ పనితీరు మెరుగవుతుందని ఆప్ సర్కారు తెలిపింది. అయితే పార్లమెంటరీ సెక్రటరీలు అవసరమైనప్పుడు ప్రభుత్వ వాహనం ఉపయోగించుకుంటారని, అనుసంధానించిన మంత్రి కార్యాలయంలోనే వారికి కేటాయించిన స్థలంలో కూర్చుని పనిచేస్తూ అధికార విధుల నిర్వహణలో మంత్రికి సహాయపడతారని ప్రభుత్వ ఉత్తర్వు పేర్కొంది. అయితే ఆప్ సర్కారు జారీ చేసి ఈ ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ ఆరోపించింది. ఏ చ ట్టం ప్రకారం కూడా పార్లమెంటరీ సెక్రటరీలను నియమించి వారితో ప్రమాణస్వీకారం చేయించే అధికారం ముఖ్యమంత్రికి లేదని పిటిషన్ పేర్కొంది. కనుక ఈ నియమాకం చెల్లదని పేర్కొంది. ఢిల్లీ సర్కారు జారీ చేసే నియామకపు ఉత్తర్వులు లెఫ్టినెంట్ గవర్నర్ పేరు మీద నిర్ధిష్ట పద్ధతి ప్రకారం వెలువడుతాయని పిటిషన్ పేర్కొంది. చట్టవిర్ధుంగా నియమితులైన పార్లమెంటరీ సెక్రటరీలు పనిచేయకుండా అడ్డుకోవాలని పిటిషన్ కోర్టును కోరింది. -
సరికాదు..
పార్లమెంటరీ కార్యదర్శుల నియామక జీవో నిలిపివేత చట్ట ప్రకారం జరగలేదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: పార్లమెంటరీ కార్యదర్శులను నియమిస్తూ రాష్ర్ట ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలును హైకోర్టు నిలిపేసింది. ఈ నియామకాలు చట్టప్రకారం నిబంధనలకు అనుగుణంగా లేవని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, జలగం వెంకట్రావు, బి.శ్రీనివాస్‌గౌడ్, జి.కిషోర్‌కుమార్, వి.సతీష్‌కుమార్, కోవా లక్ష్మిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించి మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ నియామకాలు చట్ట ప్రకారం జరగలేదని తేల్చి చెప్పింది. ఇకపై పార్లమెంట్ కార్యదర్శుల నియామకం చేపట్టాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం వ్యవహారంలో లోటుపాట్లు ఉంటే సవరించుకునేందుకు అవకాశం ఇవ్వాలన్న అడ్వొకేట్ జనరల్ అభ్యంతరాలను ధర్మాసనం సున్నితంగా తిరస్కరించింది. తాము చట్టం జోలికి వెళ్లడం లేదని, కేవలం నియామకపు జీవోను మాత్రమే నిలుపుదల చేస్తున్నామని తెలిపింది. అంతకుముందు పిటిషనర్ల తర ఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ తదితరులు వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగం ప్రకారం మొత్తం శాసనసభ్యుల్లో మంత్రుల సంఖ్య 15 శాతానికి మించి ఉండకూడదని కోర్టు దృష్టికి తెచ్చారు. -
'చీవాట్లు తినడానికే కేసీఆర్ సర్కారు పరిమితం'
పార్లమెంటరీ సెక్రటరీల నియామకంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. హైకోర్టుతో చీవాట్లు తినడానికే కేసీఆర్ సర్కారు పరిమితం అవుతోందని ఆయన మండిపడ్డారు. వాటర్ గ్రిడ్ పథకం మీద కూడా తాము హైకోర్టుకు వెళ్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంటులో స్కాం జరిగిందని, విచారణలోనే దాని వాస్తవాలు తెలుస్తాయని ప్రభాకర్ అన్నారు. ఇక పార్లమెంటు సెక్రటరీల నియామకం రాజ్యాంగ విరుద్ధమని తాము గతంలోనే చెప్పినట్లు బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదని హైకోర్టు చెప్పడం కేసీఆర్ తొందరపాటు పనులకు నిదర్శనమని ఆయన విమర్శించారు. ఓటుబ్యాంకు, రాజకీయ పునరావాస విధానాలకు ఇప్పటికైనా కేసీఆర్ స్వస్తి పలకాలని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు. -
నేడు హైకోర్టులో కీలక అంశాల విచారణ
హైదరాబాద్: హైకోర్టులో పలు కేసులు శుక్రవారం విచారణకు రానున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన శేషాచల ఎన్‌కౌంటర్‌పై హైకోర్టు నేడు విచారణ చేయనుంది. దీనితోపాటు తెలంగాణ ప్రభుత్వం నియమించిన పార్లమెంటరీ సెక్రటరీల నియామకంపై మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు జారీ చేయనుంది. అలాగే ల్యాండ్‌పూలింగ్ నుంచి మినహాయించాలంటూ రాజధాని ప్రాంత రైతులు వేసిన పిటిషన్‌ను కూడా హైకోర్టు విచారించనుంది. హైకోర్టు విభజన అంశంపై తీర్పును నేడు విచారించనుంది. -
పార్లమెంటరీ కార్యదర్శులుగా 21 మంది ఎమ్మెల్యేలు
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీలోని 70 స్థానాల్లో 67 స్థానాలను గెలవడం కూడా ఆమ్ ఆద్మీకి సమస్యగా మారింది. ఎన్నో ఆశలతో గెలిచిన ఇంతమంది ఎమ్మెల్యేల సేవలను వినియోగించుకోవడం కోసం ఆప్ సర్కారు కొత్త ప్రయోగాలు చేస్తోంది. 21 మంది ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించడం సాధారణంగా పాటించే సాంప్రదాయం. అయితే కొత్త ఆనవాయితీకి తెరతీస్తూ 21 మందికి ఈ పదవి కట్టబెట్టనుంది. వీరు వేతనభత్యాలు లేకుండా పార్లమెంటరీ సెక్రటరీలుగా పనిచేస్తారని సిసోడియా చెప్పారు. ఒక్కొక్క మంత్రి వద్ద ఒకటి కన్నా ఎక్కువ శాఖలు ఉన్నందువల్ల వారు తమ శాఖలపై పూర్తి దృష్టి కేంద్రీకరించలేకపోతున్నారని, తమ శాఖల నిర్వహణలో వారికి పార్లమెంటరీ సెక్రటరీలు సహాయపడతారని ప్రభుత్వం తెలిపింది. ఇందుకోసం మనీష్‌తో సహా ఒక్కో మంత్రికి నలుగురైదుగురు పార్లమెంటరీ సెక్రటరీలను జతచేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వారు తమ ఇన్చార్జి మంత్రి ఆదేశాల మేరకు పనిచేస్తూ పనులు వేగంగా, సమర్థంగా జరిగేలా చూస్తారని ప్రభుత్వం అంటోంది. సచివాలయంలో తమకు కేటాయించిన కార్యాలయాల నుంచి పనిచేసే పార్లమెంటరీ సెక్రటరీలకు ఎలాంటి వేతనభత్యాలు ఇవ్వబోమని ప్రభుత్వం తెలిపింది. అంతకుముందు ప్రభుత్వం 11 మంది ఎమ్మెల్యేలను ఢిల్లీ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్లుగా నియమిస్తూ గురువారం ప్రకటన జారీచేసింది. -
ఆరుగురు పార్లమెంటరీ సెక్రటరీలు నియామకం
-
ఆరుగురు పార్లమెంటరీ సెక్రటరీలు నియామకం
హైదరాబాద్: రాష్ట్రంలో ఆరుగురు పార్లమెంటరీ సెక్రటరీలను నియమిస్తూ కేసీఆర్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్లమెంట్ సెక్రటరీలుగా వి. సతీష్ కుమార్ (విద్యాశాఖ), జీ కిషోర్ కుమార్ (వైద్యశాఖ), శ్రీనివాస్‌గౌడ్ (రెవెన్యూ శాఖ), కోవా లక్ష్మీ (వ్యవసాయ శాఖ), జలగం వెంకట్రావ్, వినయ్ భాస్కర్లకు సీఎం కార్యాలయ శాఖలు కేటాయించినట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. వీరంతా ఆయా శాఖల మంత్రులకు అనుబంధంగా పని చేస్తారని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలలో పేర్కొంది. -
ఆగమేఘాలపై ఆర్డినెన్స్
* పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి లైన్‌క్లియర్ * ఉదయం అరగంటపాటు తెలంగాణ కేబినెట్ భేటీలో నిర్ణయం సాక్షి, హైదరాబాద్: కొత్తగా పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఆగమేఘాలపై ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. వెంటనే సంబంధిత ఫైలు గవర్నర్ నరసింహన్‌కు చేరింది. ఆయన ఆమోదముద్ర వేయడంతో రాత్రికే ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీచేసింది. ఒక్కరోజులోనే ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. పార్లమెంటరీ సెక్రెటరీల నియామకం, వారి జీతభత్యాలు, సంబంధిత వ్యవహారాలను ఆర్డినెన్స్‌లో పొందుపరిచింది. దీన్ని రాష్ట్ర గెజిట్లోనూ ప్రచురించినట్లు సర్కారు ప్రకటించింది. దీంతో పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి లైన్‌క్లియర్ అయింది. ఆర్డినెన్స్ జారీ చేసేందుకు అసెంబ్లీని ప్రొరో గ్చేయాల్సి ఉంటుంది. అందుకే రాష్ర్ట శాసనసభ రెండో విడత సమావేశాలు శుక్రవారం ముగిసినట్లుగా గవర్నర్ ఆమోదంతో అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం ఉత్తర్వులు జారీ చేశారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆర్డినెన్స్ ఉత్తర్వులు వెలువడ్డాయి. కేబినెట్ పరిమాణంపై ఉన్న పరిమితుల దృష్ట్యా మంత్రి పదవులను ఆశించిన పలువురు టీఆర్ఎస్ నేతలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించాలని సీఎం కె. చంద్రశేఖర్‌రావు ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. జలగం వెంకట్రావు, శ్రీనివాస్‌గౌడ్, వినయ్‌భాస్కర్, కోవ లక్ష్మిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించే అవకాశమున్నట్లు ప్రకటనలు వెలువడ్డాయి. ఈ పదవుల విషయంలో వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న నియామక ప్రక్రియపై సీఎం ఇప్పటికే అధ్యయనం చేయించారు. సహాయ మంత్రుల హోదా ఉండే పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి రాజ్యాంగం ప్రకారం చట్టసభల ఆమోదం పొందాల్సి ఉంటుంది. అందుకే అత్యవసరంగా భావించి ఆర్డినెన్స్ జారీకి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం కేవలం అరగంటసేపు సమావేశమైంది. ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించి నట్లు పలువురు మంత్రులు వెల్లడించారు. కేబినేట్ ఆమోదంతో ఆర్డినెన్స్ జారీ చేయాల్సిన అవశ్యాన్ని సీఎం వివరించారు. లేకుంటే చట్టపరంగా చిక్కులు వస్తాయని, కొన్ని రాష్ట్రాల్లో అలా చేపట్టిననియామకాలు తిరస్కరణకు గురయ్యాయని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల వ్యవధిలో లేదా తదుపరి జరిగే శాసనసభ సమావేశాల్లో ఆర్డినెన్స్‌కు ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇదే సమావేశంలో మంత్రివర్గం మరో మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరంగల్‌లో నిర్మించ తలపెట్టిన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్‌కు ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లో క్రైస్తవ భవన నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే మైనార్టీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అలాగే కొత్త సంవత్సర వేడుకలు జరుపుకొనే జనవరి ఒకటిని సెలవు దినంగా ప్రకటించింది. బదులుగా రెండో శనివారం సెలవు దినమైన ఫిబ్రవరి 14న ఉద్యోగులు పనిచేయాలని నిర్ణయించింది. రెండోసారి కేటీఆర్ డుమ్మా! రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానికి మంత్రి కేటీఆర్ వరుసగా రెండోసారి గైర్హాజరయ్యా రు. కేబినెట్ విస్తరణ రోజున పూర్తిస్థాయి మం త్రివర్గంతో నిర్వహించిన భేటీకి ఆయన హాజ రుకాని విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన భేటీకి కూడా కేటీఆర్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన కుటుం బసభ్యులతో కలిసి కేరళ టూర్‌కు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. కారణాలేవైనా పది రోజుల వ్యవధిలో నాలుగు ముఖ్య కార్యక్రమాలకు కేటీఆర్ అంటీ ముట్టనట్లుగా ఉండ టం గమనార్హం. ఇటీవలి మంత్రివర్గ విస్తరణ కు కేటీఆర్ రాకపోవటం పలు సందేహాలకు తావిచ్చింది. పదవుల పంపకానికి సంబంధించిన విభేదాలే కారణమనే ప్రచారానికి తెరలేపింది. అదే రోజున సాయంత్రం పూర్తిస్థాయి మంత్రివర్గంతో నిర్వహించిన భేటీకి సైతం కేటీఆర్ హాజరవలేదు. అంతకు వారం ముం దు సిద్దిపేటలో వాటర్‌గ్రిడ్‌పై సీఎం మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఇది కేటీఆర్ మంత్రిత్వ శాఖ కార్యక్రమమైనప్పటికీ దానికి వెళ్లలేదు. అంతేగాదు దుబాయ్ నుంచి తిరిగొచ్చాక సెక్రెటేరియట్ విధులకు కూడా ఆయన హాజరుకాలేదు. ఇక శుక్రవారం నాటి సమావేశానికి కొత్తగా మంత్రివర్గంలో చేరిన తుమ్మల నాగేశ్వరరావు రాలేదు. ఖమ్మంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం ఉన్నందున సీఎం సూచన మేరకే ఆయన హాజరుకాలేదని సహచర మంత్రులు తెలిపారు.