* పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి లైన్‌క్లియర్
* ఉదయం అరగంటపాటు తెలంగాణ కేబినెట్ భేటీలో నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కొత్తగా పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి వీలుగా తెలంగాణ ప్రభుత్వం ఆగమేఘాలపై ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. శుక్రవారం రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. వెంటనే సంబంధిత ఫైలు గవర్నర్ నరసింహన్‌కు చేరింది. ఆయన ఆమోదముద్ర వేయడంతో రాత్రికే ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను జారీచేసింది. ఒక్కరోజులోనే ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. పార్లమెంటరీ సెక్రెటరీల నియామకం, వారి జీతభత్యాలు, సంబంధిత వ్యవహారాలను ఆర్డినెన్స్‌లో పొందుపరిచింది. దీన్ని రాష్ట్ర గెజిట్‌లోనూ ప్రచురించినట్లు సర్కారు ప్రకటించింది. దీంతో పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి లైన్‌క్లియర్ అయింది.
ఆర్డినెన్స్ జారీ చేసేందుకు అసెంబ్లీని ప్రొరో గ్‌చేయాల్సి ఉంటుంది. అందుకే రాష్ర్ట శాసనసభ రెండో విడత సమావేశాలు శుక్రవారం ముగిసినట్లుగా గవర్నర్ ఆమోదంతో అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం ఉత్తర్వులు జారీ చేశారు. కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఆర్డినెన్స్ ఉత్తర్వులు వెలువడ్డాయి. కేబినెట్ పరిమాణంపై ఉన్న పరిమితుల దృష్ట్యా మంత్రి పదవులను ఆశించిన పలువురు టీఆర్‌ఎస్ నేతలను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించాలని సీఎం కె. చంద్రశేఖర్‌రావు ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. జలగం వెంకట్రావు, శ్రీనివాస్‌గౌడ్, వినయ్‌భాస్కర్, కోవ లక్ష్మిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించే అవకాశమున్నట్లు ప్రకటనలు వెలువడ్డాయి.
ఈ పదవుల విషయంలో వివిధ రాష్ట్రాల్లో అమల్లో ఉన్న నియామక ప్రక్రియపై సీఎం ఇప్పటికే అధ్యయనం చేయించారు. సహాయ మంత్రుల హోదా ఉండే పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి రాజ్యాంగం ప్రకారం చట్టసభల ఆమోదం పొందాల్సి ఉంటుంది. అందుకే అత్యవసరంగా భావించి ఆర్డినెన్స్ జారీకి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం కేవలం అరగంటసేపు సమావేశమైంది. ఈ అంశంపైనే ప్రధానంగా చర్చించి నట్లు పలువురు మంత్రులు వెల్లడించారు. కేబినేట్ ఆమోదంతో ఆర్డినెన్స్ జారీ చేయాల్సిన అవశ్యాన్ని సీఎం వివరించారు. లేకుంటే చట్టపరంగా చిక్కులు వస్తాయని, కొన్ని రాష్ట్రాల్లో అలా చేపట్టిననియామకాలు తిరస్కరణకు గురయ్యాయని ఆయన పేర్కొన్నట్లు సమాచారం.
రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల వ్యవధిలో లేదా తదుపరి జరిగే శాసనసభ సమావేశాల్లో ఆర్డినెన్స్‌కు ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఇదే సమావేశంలో మంత్రివర్గం మరో మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. వరంగల్‌లో నిర్మించ తలపెట్టిన కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సెన్సైస్‌కు ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లో క్రైస్తవ భవన నిర్మాణానికి రూ.10 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆ వెంటనే మైనార్టీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అలాగే కొత్త సంవత్సర వేడుకలు జరుపుకొనే జనవరి ఒకటిని సెలవు దినంగా ప్రకటించింది. బదులుగా రెండో శనివారం సెలవు దినమైన ఫిబ్రవరి 14న ఉద్యోగులు పనిచేయాలని నిర్ణయించింది.
రెండోసారి కేటీఆర్ డుమ్మా!
రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానికి మంత్రి కేటీఆర్ వరుసగా రెండోసారి గైర్హాజరయ్యా రు. కేబినెట్ విస్తరణ రోజున పూర్తిస్థాయి మం త్రివర్గంతో నిర్వహించిన భేటీకి ఆయన హాజ రుకాని విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన భేటీకి కూడా కేటీఆర్ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన కుటుం బసభ్యులతో కలిసి కేరళ టూర్‌కు వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. కారణాలేవైనా పది రోజుల వ్యవధిలో నాలుగు ముఖ్య కార్యక్రమాలకు కేటీఆర్ అంటీ ముట్టనట్లుగా ఉండ టం గమనార్హం.
ఇటీవలి మంత్రివర్గ విస్తరణ కు కేటీఆర్ రాకపోవటం పలు సందేహాలకు తావిచ్చింది. పదవుల పంపకానికి సంబంధించిన విభేదాలే కారణమనే ప్రచారానికి తెరలేపింది. అదే రోజున సాయంత్రం పూర్తిస్థాయి మంత్రివర్గంతో నిర్వహించిన భేటీకి సైతం కేటీఆర్ హాజరవలేదు. అంతకు వారం ముం దు సిద్దిపేటలో వాటర్‌గ్రిడ్‌పై సీఎం మంత్రులతో సమీక్ష నిర్వహించారు.
ఇది కేటీఆర్ మంత్రిత్వ శాఖ కార్యక్రమమైనప్పటికీ దానికి వెళ్లలేదు. అంతేగాదు దుబాయ్ నుంచి తిరిగొచ్చాక సెక్రెటేరియట్ విధులకు కూడా ఆయన హాజరుకాలేదు. ఇక శుక్రవారం నాటి సమావేశానికి కొత్తగా మంత్రివర్గంలో చేరిన తుమ్మల నాగేశ్వరరావు రాలేదు. ఖమ్మంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం ఉన్నందున సీఎం సూచన మేరకే ఆయన హాజరుకాలేదని సహచర మంత్రులు తెలిపారు.
ఆగమేఘాలపై ఆర్డినెన్స్
Published Sat, Dec 20 2014 1:19 AM | Last Updated on Sat, Aug 11 2018 6:56 PM
Advertisement
Advertisement