సరికాదు..
పార్లమెంటరీ కార్యదర్శుల నియామక జీవో నిలిపివేత
చట్ట ప్రకారం జరగలేదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటరీ కార్యదర్శులను నియమిస్తూ రాష్ర్ట ప్రభుత్వం జారీ చేసిన జీవో అమలును హైకోర్టు నిలిపేసింది. ఈ నియామకాలు చట్టప్రకారం నిబంధనలకు అనుగుణంగా లేవని తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
అధికార పార్టీ ఎమ్మెల్యేలు వినయ్‌భాస్కర్, జలగం వెంకట్రావు, బి.శ్రీనివాస్‌గౌడ్, జి.కిషోర్‌కుమార్, వి.సతీష్‌కుమార్, కోవా లక్ష్మిని పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమిస్తూ జారీ చేసిన జీవోను సవాల్ చేస్తూ నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాజ్యాలను ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించి మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ నియామకాలు చట్ట ప్రకారం జరగలేదని తేల్చి చెప్పింది. ఇకపై పార్లమెంట్ కార్యదర్శుల నియామకం చేపట్టాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం వ్యవహారంలో లోటుపాట్లు ఉంటే సవరించుకునేందుకు అవకాశం ఇవ్వాలన్న అడ్వొకేట్ జనరల్ అభ్యంతరాలను ధర్మాసనం సున్నితంగా తిరస్కరించింది. తాము చట్టం జోలికి వెళ్లడం లేదని, కేవలం నియామకపు జీవోను మాత్రమే నిలుపుదల చేస్తున్నామని తెలిపింది. అంతకుముందు పిటిషనర్ల తర ఫున సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ తదితరులు వాదనలు వినిపిస్తూ.. రాజ్యాంగం ప్రకారం మొత్తం శాసనసభ్యుల్లో మంత్రుల సంఖ్య 15 శాతానికి మించి ఉండకూడదని కోర్టు దృష్టికి తెచ్చారు.