ఢిల్లీ ఎమ్మెల్యేలపై వేటుతో ఓరుగల్లులో గుబులు | what will happen for the parliamentary secretaries | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఎమ్మెల్యేలపై వేటుతో ఓరుగల్లులో గుబులు

Published Mon, Jan 22 2018 5:24 PM | Last Updated on Mon, Jan 22 2018 6:12 PM

what will happen for the parliamentary secretaries - Sakshi

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: పార్లమెంటరీ కార్యదర్శి పోస్టు వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వంతో ఈ పదవులు చేపట్టిన 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ప్రభావం వరంగల్‌ ఉమ్మడి జిల్లాలోనూ చర్చనీయాంశంగా మారింది. పార్లమెంటరీ కార్యదర్శి పదవులు నిర్వహించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటనేది రాజకీయవర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. 2014 సాధారణ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో గెలిచి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఆ  తర్వాత మంత్రివర్గం కొలువుదీరింది.

మంత్రివర్గ సంఖ్యకు పరిమితి ఉండడంతో పలువురికి పార్లమెంటరీకార్యదర్శి పోస్టులను ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. రాష్ట్రం లో ఆరుగురు ఎమ్మెల్యేను పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించింది. ప్రస్తుతం వరంగల్‌ అర్బన్‌ జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌కు, హుస్నాబాద్‌ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌బాబుకు పార్లమెంటు కార్యదర్శి పదవులు దక్కాయి. రా జ్యంగ విరుద్ధంగా ఈ పదవువులను ఇచ్చారంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి. పదవులు రద్దు చేయాలని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాయి. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంటరీ కార్యదర్శి పదవులు రద్దు చేసింది. 

ఈసీ నిర్ణయంతో...
ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్‌ పార్టీ ప్రభుత్వంలో 20 మంది ఎమ్మెల్యేలు పార్లమెంటరీ కార్యదర్శి హోదాలో  కొనసాగి లాభదాయ పదవి నిర్వహించారనే అభియోగంపై వీరి శాసనసభ  సభ్యత్వం రద్దు చేయాల్సిందిగా ఎలక్షన్‌ కమిషన్‌ రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఈసీ గడప తొక్కేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో గతంలో పార్లమెంటరీ కార్యదర్శి పదవిలో కొనసాగిన ఆరుగురు ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దు చేయాలని రాష్ట్రంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది.

సోమవారం ఈ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పార్లమెంటరీ కార్యదర్శి పదవులు నిర్వహించిన ఎమ్మెల్యేల పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. మన రాష్ట్రంలో పార్లమెంటరీ కార్యదర్శి పదవి నిర్వహించిన ఎమ్మెల్యేలు ఢిల్లీ ఎమ్మెల్యేలపై వచ్చిన నిర్ణయంతో ఆందోళన చెందుతున్నారు. దాస్యం వినయ్‌ భాస్కర్‌ వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో మంత్రి పదవి వస్తుందని ఆశించారు. వివిధ సమీకరణల వల్ల మంత్రి పదవి దక్కలేదు. ఆ తర్వాత పార్లమెంటు కార్యదర్శి పదవి చేపట్టినా ఎక్కువ కాలం లేదు. మరోవైపు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వొడితెల సతీశ్‌బాబుకు పార్లమెంటరీ కార్యదర్శి పదవి చేపట్టారు. కొద్దిరోజులకే ఈ పదవికి దూరమయ్యారు. తాజాగా కాంగ్రెస్‌ తీసుకుంటున్న రాజకీయ నిర్ణయంతో వీరిద్దరికి ఎలాంటి పరిస్థితి వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement