కేజ్రీవాల్ సర్కారుకు దెబ్బమీద దెబ్బ
న్యూఢిల్లీ: అరవింద్ కేజ్రీవాల్ సర్కారుకు దెబ్బమీద దెబ్బ తగులుతున్నాయి. మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు కేసుల్లో ఇరుక్కోవడంతో ఇంటాబయటా విమర్శపాలైన కేజ్రీవాల్ ప్రభుత్వానికి హైకోర్టులోనూ చుక్కెదురైంది. 21 మంది పార్లమెంటరీ కార్యదర్శుల నియామకంను ఉన్నత న్యాయస్థానం గురువారం రద్దు చేసింది.
పార్లమెంటరీ సెక్రటరీల నియామకం బిల్లుపై సంతకం చేసేందుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి జూన్లో నిరాకరించారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు లాభదాయక పదవులు చేపట్టడం రాజ్యంగ ఉల్లంఘన కిందకు వస్తుంది.
పార్లమెంటరీ కార్యదర్శుల నియామకాలను అంతకుముందు కోర్టులో కేజ్రీవాల్ సర్కారు సమర్థించుకుంది. పార్లమెంటరీ సెక్రటరీలకు ప్రభుత్వం ఎటువంటి వేతనాలు చెల్లించదని తెలిపింది. అధికారిక కార్యకలాపాలకు మాత్రమే ప్రభుత్వ వాహనాలను వినియోగిస్తారని వెల్లడించింది. మంత్రుల కార్యాలయాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తారని చెప్పింది. ప్రభుత్వం వాదనలతో ఏకీభవించని హైకోర్టు పార్లమెంటరీ కార్యదర్శుల నియామకంను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.