'చీవాట్లు తినడానికే కేసీఆర్ సర్కారు పరిమితం'
పార్లమెంటరీ సెక్రటరీల నియామకంపై టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. హైకోర్టుతో చీవాట్లు తినడానికే కేసీఆర్ సర్కారు పరిమితం అవుతోందని ఆయన మండిపడ్డారు. వాటర్ గ్రిడ్ పథకం మీద కూడా తాము హైకోర్టుకు వెళ్తామన్నారు. ఫీజు రీయింబర్స్మెంటులో స్కాం జరిగిందని, విచారణలోనే దాని వాస్తవాలు తెలుస్తాయని ప్రభాకర్ అన్నారు.
ఇక పార్లమెంటు సెక్రటరీల నియామకం రాజ్యాంగ విరుద్ధమని తాము గతంలోనే చెప్పినట్లు బీజేపీ ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చెల్లదని హైకోర్టు చెప్పడం కేసీఆర్ తొందరపాటు పనులకు నిదర్శనమని ఆయన విమర్శించారు. ఓటుబ్యాంకు, రాజకీయ పునరావాస విధానాలకు ఇప్పటికైనా కేసీఆర్ స్వస్తి పలకాలని డాక్టర్ లక్ష్మణ్ చెప్పారు.