అధికారంలో ఉన్నామనే అహంభావం
► హైకోర్టు విభజన కేంద్రం చేతుల్లో లేదు
► బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్
ఆదిలాబాద్ క్రైం : అధికారంలో ఉన్నామనే అహంభావంతో రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంత్రి శ్రీనివాస్ మండిపడ్డారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఓప్రైవేట్ హోటల్‌లో బీజేపీ జిల్లా పదాధికారుల కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై, ప్రజల సమస్యలపై బీజేపీ చేయాల్సిన పోరాటాలపై రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గత రెండేళ్లలో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని అనడం సిగ్గుచేటన్నారు. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదని, అది ప్రజల చేతుల్లో ఉంటుందని గుర్తు చేశారు.
హైకోర్టు విభజన కేంద్ర ప్రభుత్వం చేతుల్లో లేదని, అది రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు, హైకోర్టు, సుప్రింకోర్టు తేల్చాల్సి ఉంటుందన్నారు. అంతకుముందు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే దిశగా పార్టీని బలోపేతం చేస్తున్నామన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని చెప్పిన కేసీఆర్ ఇంత వరకు ఒక్కరికి కూడా ఉద్యోగం కల్పించలేదన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా ఇన్‌చార్జీ మురళిధర్‌గౌడ్, రాష్ట్ర కార్యదర్శి రమాదేవి, జిల్లా మాజీ అధ్యక్షులు భూమయ్య, రావుల రాంనాథ్, ఉపాధ్యక్షుడు మడావిరాజు, మహిళ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సుహాసినిరెడ్డి, నాయకులు విజయ్‌కుమార్, నారాయణరెడ్డి ఉన్నారు.