న్యూఢిల్లీ: ఢిల్లీలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. లాభదాయక పదవుల్లో కొనసాగినందుకు ఆ పార్టీకి చెందిన 20 ఎమ్మెల్యేల్ని అనర్హులుగా ప్రకటించాలని రాష్ట్రపతికి కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేస్తూ గట్టి షాకిచ్చింది. ఒకపక్క ఎమ్మెల్యేలుగా ఉంటూనే మరోవైపు పార్లమెంటరీ కార్యదర్శులుగా కొనసాగారని.. ఈ నేపథ్యంలో వారిపై చర్యలు సమంజసమేనని సిఫార్సుల్లో ఈసీ పేర్కొంది. మరోవైపు ఈసీ సిఫార్సుల్ని సవాలు చేస్తూ అనర్హత జాబితాలోని ఏడుగురు ఎమ్మెల్యేలు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
అయితే ఈసీ సిఫార్సులపై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు కోర్టు నిరాకరించింది. 20 మంది ఎమ్మెల్యేలు అనర్హతకు గురైనా కేజ్రీవాల్ సర్కారుకు ప్రస్తుతానికి ఎలాంటి ముప్పు లేదు. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్‌కు 65 మంది ఎమ్మెల్యేల బలముంది. ఎమ్మెల్యేల్ని అనర్హులుగా ప్రకటించాలని శుక్రవారం ఉదయం ఎన్నికల సంఘం తన అభిప్రాయాన్ని రాష్ట్రపతికి పంపింది.
మార్చి 13, 2015 నుంచి సెప్టెంబర్ 8, 2016 వరకూ ఆ ఎమ్మెల్యేలు పార్లమెంటరీ కార్యదర్శులుగా లాభదాయక పదవుల్లో ఉన్నారని, అందువల్ల వారిని శాసన సభ్యులుగా అనర్హులుగా ప్రకటించవచ్చని ఈసీ స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆప్ ఈసీ సిఫార్సుల్ని ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసింది. అయితే మధ్యంతర ఉత్తర్వులకు తిరస్కరించిన హైకోర్టు.. ఎమ్మెల్యేల అనర్హతపై తుది నివేదికను రాష్ట్రపతికి పంపారా? అన్న విషయంపై జనవరి 22 లోగా సమాధానం చెప్పాలని ఈసీని ఆదేశించింది.
రాజ్యాంగ పదవిని జోతి తాకట్టు పెట్టారు
ఈసీ నిర్ణయంపై ఆప్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ‘నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్న హయాంలో ఏకే జోతి ముఖ్య కార్యదర్శిగా ఉండేవారు. అనంతరం ప్రధాన కార్యదర్శి అయ్యారు. సోమవారం ఆయన పదవీ విరమణ చేస్తున్నారు. అందువల్ల మోదీ రుణం తీర్చుకోవాలని కోరుకుంటున్నారు. మీరు రాజ్యాంగ పదవిని తాకట్టు పెడుతున్నారు’ అని ఆప్ ప్రతినిధి సౌరభ్ ఆరోపించారు.
ఈసీ ఎమ్మెల్యేల వాదనను వినలేదని ఆయన చెప్పారు. అధికారంలో కొనసాగేందుకు ఆప్ ప్రభుత్వానికి ఎలాంటి నైతిక హక్కు లేదని, సీఎం పదవి నుంచి కేజ్రీవాల్ వైదొలగాలని బీజేపీ, కాంగ్రెస్‌లు డిమాండ్ చేశాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా పోటీకి సిద్ధమని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు మనోజ్ తివారీ చెప్పారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అధికారాన్ని అనుభవిస్తూ.. విదేశీ ప్రయాణాలతో జల్సా చేస్తున్నారని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ మాకెన్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment