
'గుజరాతీని.. వాణిజ్యం నా రక్తంలోనే ఉంది'
తన ప్రభుత్వంలోను, తన కార్యాలయంలోను కూడా జపాన్ తరహా సమర్ధతను తీసుకురావడానికి కట్టుబడి ఉన్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి వ్యాపారవేత్తలను, ప్రభుత్వాధికారులను, నాయకులను.. అందరినీ ఆకట్టుకునేలా మాట్లాడారు.
* ''నేను గుజరాతీని.. వాణిజ్యం నా రక్తంలోనే ఉంది. వాణిజ్యవేత్తలకు రాయితీలు అవసరం లేదు. వాళ్లకు ఎదగడానికి మంచి వాతావరణం మాత్రమే అవసరం'' అని మోడీ అన్నారు.
* జపాన్ నుంచి వచ్చే ప్రతిపాదనలను పరిశీలించడానికి తన కార్యాలయంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటుచేస్తానని మోడీ చెప్పారు. అలాగే, ఈ బృందంలో జపాన్ ఎంపిక చేసే ఇద్దరు వ్యక్తుల కోసం కార్యాలయం కూడా ఇస్తామన్నారు.
* ''ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనే 5.7 వృద్ధిరేటు నమోదైంది. ఇది చాలా పెద్ద ముందడుగు. ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి'' అంటూ తన విజయాన్ని చెప్పకనే చెప్పారు.
* ఇంతకాలం ఉన్న నిరుత్సాహకరమైన వాతావరణం ఇక ముగిసిపోయిందని, జపాన్ పెట్టుబడిదారులు భారత్కు వస్తే, వాళ్లకు చకచకా అనుమతులు లభిస్తాయని పారిశ్రామికవేత్తలకు చెప్పారు.
* చైనా పేరు ఎత్తకుండానే ఆ దేశం మీద తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విదేశీ విధానంలో అభివృద్ధి వాదమే కావాలి తప్ప విస్తరణ వాదం కాదన్నారు. 18వ శతాబ్దం నాటి ఆలోచనల్లో మగ్గిపోయేవాళ్లు ఇతరుల జలాల్లోకి ప్రవేశించి, ఆక్రమణలకు పాల్పడతారని చెప్పారు. జపాన్కు కూడా చైనాతో విరోధం ఉన్నమాట తెలిసిందే.