సీటు బెల్ట్ తీసుకునే లోపే..దారుణం
బెంగళూరు:కారులో ప్రయాణిస్తున్నపుడు సీటు బెల్ట్ పెట్టుకోవడం..ద్విచక్ర వాహనంపై వెళుతున్నపుడు హెల్మెట్ ధరించడం తప్పనిసరి. అయితే దురదృష్టవశాత్తు ఆపదలో రక్షించాల్సిన ఆ సీట్ బెల్టే బెంగళూరుకు చెందిన ఓ వ్యాపారి ప్రాణాలను బలితీసుకుంది. కారు ఇంజీన్‌కు అకస్మాత్తుగా మంటలు అంటుకోవడంతో ఆయన సజీవ దహనమైన ఘటన కలకలం రేపింది. అయితే చివరి నిమిషంలో తన కుటుంబ సభ్యుల కాపాడుకున్నా ఆయన మాత్రం మంటల్లో కాలి బూడిద కావడం మృతుని కుటుంబ సభ్యులను మరింత కలవర పరిచింది. దురదృష్టకరమైన ఈ సంఘటన ఆదివారం ఉదయం మదుక్కారై టోల్ గేటు సమీపంలో చోటు చేసుకుంది.
నగల వ్యాపారి దిలీప్‌కుమార్ (38 )భార్యా పిల్లలతో కారులో కొచ్చికి బయలుదేరారు. ఇంతలో వాహనం ఇంజిన్‌కు హఠాత్తుగా మంటలు అంటుకున్నాయి. దీంతో వెంటనే తేరుకున్న దిలీప్ కుమార్ తన భార్య ఇద్దరు పిల్లల్ని బయటకు తోసేసి మరీ ప్రమాదంనుంచి రక్షించారు. ఇంతలో మంటలు బాగా వ్యాపించడంతో సీట్ బెల్టు తీసుకునే లోపే భార్యా పిల్లల చూస్తుండగానే ఆయన మంటలకు ఆహుతైపోవడం తీవ్ర విషాదాన్ని రేపింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.