సాక్షి, న్యూఢిల్లీ: విశాలాంధ్ర ఏర్పాటుకు ముందు తూర్పుగోదావరి జిల్లాలో అంతర్భాగంగా ఉన్న భద్రాచలం డివిజన్‌ను ఖమ్మం జిల్లాలోనే కొనసాగిస్తూ రాష్ట్రాన్ని విభజించాలన్న ఖమ్మం కాంగ్రెస్ నేతల అభ్యర్థన పట్ల రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి, ఆంటోనీ కమిటీ సభ్యుడు దిగ్విజయ్‌సింగ్ సానుకూలంగా స్పందించారు. కేంద్ర మంత్రి బలరాం నాయక్ నేతృత్వంలో ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఆదివారమిక్కడ దిగ్విజయ్‌సింగ్‌ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు ముందు కూడా చాలాకాలం భద్రాచలం ఆలయ ప్రాంతం కులీ కుతుబ్‌షా, నిజాం పాలనల్లో తెలంగాణలో భాగంగా కొనసాగిందన్న చారిత్రక ఆధారాలకు సంబంధించిన పత్రాలను ఆయనకు అందజేశారు.
భద్రాచలం డివిజన్‌ను ఖమ్మం జిల్లాలోనే కొనసాగించేలా కేబినెట్ నోట్ సిద్ధం చేయాలని ప్రభుత్వానికి సూచించేందుకు దిగ్విజయ్ అంగీకరించారని సమావేశానంతరం ఖమ్మం జిల్లా నేతలు వెల్లడించారు. దిగ్విజయ్‌సింగ్ కూడా రాత్రి విలేకరులతో మాట్లాడుతూ.. భద్రాచలం డివిజన్‌ను ఖమ్మం జిల్లా నుంచి వేరు చేయవద్దని జిల్లా నేతలు కోరినట్లు వెల్లడించారు. రాష్ట్ర విభజనకు సంబంధించిన కేబినెట్ నోట్ ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోందని, ఈ నోట్ ఆధారంగా తయారయ్యే విభజన బిల్లును శాసనసభ ఆమోదం కోసం రాష్ట్రానికి పంపించాల్సి ఉంటుందని చెప్పారు. దిగ్విజయ్‌సింగ్‌ను కలిసిన వారిలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ భట్టి విక్రమార్క, మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే కుంజా సత్యవతి ఉన్నారు.