సాక్షి, న్యూఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ చట్టానికి ఇటీవల చేసిన సవరణను నిరసిస్తూ పలు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం భారత్ బంద్ సందర్భంగా ఉత్తరాదిలో ఉద్రిక్తత నెలకొంది. బిహార్‌లో నిరసనకారులు పలు రైళ్లను నిలిపివేయగా, యూపీ, మధ్యప్రదేశ్‌ల్లో దిష్టిబొమ్మల దహనం చేపట్టారు. బంద్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బిహార్‌లో విద్యాసంస్థలు, పెట్రోల్ పంపులు మూసివేశారు.
బిహార్, జార్ఖండ్‌ల్లో బస్సు సర్వీసులు రద్దయ్యాయి. పలు ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించినట్టు పోలీసులు తెలిపారు. దర్భంగా, ముంగర్ మసుదాన్, అర్రాలలో ఆందోళనకారులు రైళ్లను నిలిపివేశారు. 34 కంపెనీల సాయుధ పోలీసు బలగాలను వివిధ జిల్లాల్లో మోహరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 2న దళిత సంఘాలు పిలుపు ఇచ్చిన భారత్ బంద్‌లో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
మరోవైపు మధ్యప్రదేశ్‌లో భారత్ బంద్ ప్రభావం అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆందోళనకారులు రోడ్లపై టైర్లను దగ్ధం చేసి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. పలు జిల్లాల్లో 144 సెక్షన్ అమలు చేశామని, 35 జిల్లాల్లో హై అలర్ట్ ప్రకటించామని పోలీసు అధికారులు తెలిపారు. మధ్యప్రదేశ్, యూపీలో వివిధ ప్రాంతాల్లో ఆందోళనకారులు దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. మార్కెట్లు, దుకాణాలు మూతపడ్డాయని, బస్సుల రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment