యాసిన్ భత్కల్
న్యూఢిల్లీ: దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల కేసు నిందితుడు, నిషేధిత ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహవ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ను హైదరాబాద్ లోని నేరపరిశోధనా సంస్థ (ఎన్‌ఐఏ)అధికారుల కస్టడీకి ఇవ్వడానికి ఢిల్లీ కోర్టు అనుమతించింది. హైదరాబాద్ ఎన్‌ఐఏ అధికారులు భత్కల్‌ను విచారించనున్నారు. ఢిల్లీ కోర్టు భత్కల్‌ను రెండురోజులపాటు కస్టడీకి అనుమతించింది.
ఫిబ్రవరి 21న జరిగిన దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల ఘటనకు ప్రధాన సూత్రధారులైన యాసిన్, తబ్రేజ్‌లను గత నెల 28న భారత్-నేపాల్ సరిహద్దులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దిల్‌సుఖ్‌నగర్ జంట బాంబు పేలుళ్లకు తానే వ్యూహం పన్నినట్లు యాసిన్ భత్కల్ అంగీకరించాడు. గత వారంలో ఎన్‌ఐఏ అధికారులు భత్కల్‌ను ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి గోవా తీసుకెళ్లారు.
అక్కడ అంజునా, పనాజి సమీపంలోని చింబెల్ అనే మురికివాడలో అతడు నివసించిన ఇళ్లలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కొన్ని యాసిడ్ బాటిళ్లు, ఇతర పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. చింబెల్ ఇందిరానగర్ నుంచి విచారణ నిమిత్తం ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, అంజునాలో భత్కల్ అద్దెకు ఉన్న నివాసం నుంచి ఎన్‌ఐఏ అధికారులు బాంబు తయారీ పరికరాలు స్వాధీనం చేసుకున్నట్టు గోవా సీఎం మనోహర్ పారికర్ చెప్పారు. చాలామంది నేరస్తులు గోవాను ఆశ్రయంగా ఎంచుకుంటున్నారని, అందువల్ల స్థానికులు తమ ఇళ్లను అద్దెకు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.