
27 మంది జలసమాధి
బిహార్‌లో చెరువులో పడిన బస్సు
మధుబని/పట్నా: బిహార్‌లో సోమవారం ఒక ప్రైవేట్ బస్సు చెరువులో పడిన దుర్ఘటనలో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మధుబని జిల్లా బెన్నిపట్టి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బసైతా చౌక్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. 65 మంది ప్రయాణికులతో సీతామరి నుంచి మధుబనికి వెళ్తున్న బస్సు బసైతా చౌక్ వద్దకు రాగానే రోడ్డు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకుపోయింది. దీంతో 27 మంది జలసమాధి అయ్యారు. కొందరు ప్రయాణికులు వెంటనే తేరుకుని ఈదుకుంటూ ఒడ్డుకొచ్చారు. బస్సును క్రేన్ సహాయంతో బయటకు తీశారు.
ఈ దుర్ఘటనపై రాష్ట్ర సీఎం నితీశ్ కుమార్ విచారణకు ఆదేశించారు. బాధితులకు సత్వర సాయం అందించాలని ఉన్నతాధికారులకు సూచించారు. ఘటనాస్థలానికి చేరుకోవడంలో నిర్లక్ష్యం వహించారంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులపై రాళ్లు రువ్వారు. కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించామని, ప్రమాదానికి అసలు కారణాలు తెలియాల్సి ఉందని జిల్లా మేజిస్ట్రేట్ గిరివర్ దయాళ్ సింగ్ మీడియాతో చెప్పారు.