సవతుల మధ్య పోరుకు తెరలేపిన లాలూ
రాజకీయాల్లో ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఏం చేసినా, ఏం మాట్లాడినా సెన్సేషనల్ గా ఆసక్తికరంగా ఉంటాయి. బీహార్ ఎన్నికల్లో ఓ ఆసక్తికరమైన పోరుకు లాలూ తెర లేపారు. స్థానిక రాజకీయ నాయకుడు రణబీర్ యాదవ్ కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య పూనమ్ దేవి యాదవ్ ఖగారియా నియోజకవర్గంలో జేడీ(యూ) పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే రెండవ భార్య కృష్ణ యాదవ్ కు లాలూ తన పార్టీ ఆర్జేడి తరపున టికెట్ ఇచ్చి ఆసక్తికరమైన పోరుకు తెరలేపారు. పూనమ్ దేవి, కృష్ణ యాదవ్ లిద్దరూ స్వంత అక్కా చెల్లెల్లు కావడం విశేషం.
ఇద్దరు సవతులు పోటీలో నిలవడాన్ని చాలా తేలికగా తీసుకున్నారు. నేను జేడీ(యూ) పార్టీ ఎమ్మెల్యేను, నా పార్టీ కోసం పని చేస్తాను అని అన్నారు. అంతేకాక తమ మధ్య ఎలాంటి విబేధాలు లేవని.. తాము అన్యోన్యంగా ఉంటామన్నారు. ఇదిలా ఉండగా అథ్లెట్ గా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కృష్ణ యాదవ్ కు తన అక్క అంటే చాలా ఇష్టమట. అంతేకాక వీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటారు కూడా. ఎవరూ గెలువాలనేది ప్రజలు నిర్ణయిస్తారని.. ఎవరి గెలుపుపై వారు ధీమాగా ఉన్నారు. లాలూ లెక్కలు పనిచేస్తాయో.. లేక పూనమ్ తన ఎమ్మెల్యే గిరిని నిలబెట్టుకుంటుందో వేచి చూడాల్సిందే.