జైపూర్: రాజస్ధాన్‌లో రాజకీయ హైడ్రామా కాంగ్రెస్, బీజేపీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ నేత సంజయ్ జైన్, కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేతో కలిసి కుట్ర పన్నారని ఆడియో టేప్‌లను బయటపెట్టిన కాంగ్రెస్‌పై కాషాయ నేతలు విరుచుకుపడ్డారు. తమ పార్టీ సీనియర్ నేతలపై రాజస్దాన్ పోలీస్ ఎస్‌ఓజీకి పాలక పార్టీ ఫిర్యాదు చేయడంపై దీటుగా స్పందించారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌తో పాటు తమ సొంత పార్టీ వారిపై కాంగ్రెస్ ప్రతినిధి ఆరోపణలు చేయడం అర్థరహితమని రాజస్ధాన్ బీజేపీ రాష్ట్ర చీఫ్, అంబర్ ఎమ్మెల్యే డాక్టర్ సతీష్ పునియా వ్యాఖ్యానించారు. ఈ ఆడియో టేపులను కాంగ్రెస్ పార్టీ ఎక్కడి నుంచి రాబట్టిందని ప్రశ్నించారు. సీఎం కార్యాలయం నుంచే లోకేష్ శర్మ అనే వ్యక్తి ఈ టేప్ లీక్ చేశారనే సమాచారం ఉందని పునియా ఆరోపించారు. కాంగ్రెస్ చర్యలు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించిన సంజయ్ జైన్ బీజేపీ నేత కాదని, ఆయన కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడని స్పష్టం చేశారు. కరోనా సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని, ఈ వ్యాధితో రాష్ట్రంలో 500 మందికి పైగా మరణించారని అన్నారు. మరోవైపు అంతర్గత కుమ్ములాటల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీ ఈ రొంపిలోకి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను లాగేందుకు ప్రయత్నిస్తోందని రాజస్ధాన్ అసెంబ్లీలో విపక్ష నేత, బీజేపీ నాయకుడు గులాబ్ చంద్ కటారియా ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్‌కు ప్రభుత్వ యంత్రాంగాన్ని కాంగ్రెస్ నేతలు వాడుకున్నారని దుయ్యబట్టారు. ఈ టేపులు రాజస్ధాన్‌లో వాటర్‌గేట్ కుంభకోణం జరిగిందని చాటుతోందని బీజేపీ నేత, ఎమ్మెల్యే రాజేంద్ర రాథోడ్ ఆరోపించారు. టేపులు రికార్డు చేసిన లోకేష్ శర్మను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ వెల్లడించిన ఆడియో టేప్‌ల్లో వాయిస్ తనది కాదని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఇప్పటికే తోసిపుచ్చారు. చదవండి : అది నకిలీ ఆడియో
Comments
Please login to add a commentAdd a comment