అస్సాం గడ్డపై బీజేపీ బోణీ
♦ మూడింట రెండొంతుల మెజారిటీ
♦ 5 నుంచి 60 సీట్లకు ఎదిగిన బీజేపీ
♦ గొగోయ్‌కు అస్సాం బైబై..
♦ కింగ్‌మేకర్ అనుకున్న ఏఐయూడీఎఫ్ చీఫ్ ఓటమి
గువాహతి: ఈశాన్యరాష్ట్రాల్లో పాగా వేయాలని చాలాకాలంగా చేస్తున్న ప్రయత్నంలో బీజేపీ విజయంసాధించింది. అస్సాంలో స్పష్టమైన మెజారిటీతో తొలిసారి బీజేపీ జెండా ఎగిరింది. గత ఎన్నికల్లో ఐదుసీట్లున్న అస్సాంలో.. ఏకంగా 60 సీట్లు గెలుచుకుని ప్రభంజనం సృష్టించింది.
ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలుపుకుని 86 సీట్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుంది. 15 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీని దించేసి.. అధికారం చేజిక్కించుకుంది. బీజేపీతోపాటు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన అస్సాం గణపరిషత్ (ఏజీపీ), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీవోపీఎఫ్) పార్టీలు కూడా సత్తాచాటాయి. మొత్తం 126 సీట్లున్న అస్సాం అసెంబ్లీలో తాజా ఫలితాల్లో ఎన్డీఏ కూటమి 86 స్థానాలు గెలుపొందింది.
ఇందులో బీజేపీ 60 స్థానాల్లో, ఏజీపీ 14 స్థానాల్లో, బీవోపీఎఫ్ 12 చోట్ల విజయం సాధించాయి. అటు కాంగ్రెస్ 26 స్థానాల్లో, ఏఐయూడీఎఫ్ 13 స్థానాల్లో గెలుపొందగా.. ఇతరులు ఒక స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఎన్నికలకు ఏడాది ముందుగానే ప్రణాళికలు రూపొందించి వ్యూహాత్మకంగా ప్రచారాన్ని ప్రారంభించిన బీజేపీ.. అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది.
బీజేపీకి సోనో‘వాల్’
కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా అస్సాం బీజేపీకి ఉన్న నాయకత్వ లోపానికి సర్బానంద సోనోవాల్ పరిష్కారం చూపారు. అసోం గణపరిషత్‌తో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన సోనోవాల్ 2011లో బీజేపీలో చేరి గత లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. పార్టీ ముఖ్యనాయకులతో కలిసి ఈ ఎన్నికల్లో ప్రచారాన్ని ముందుండి నడిపించారు. ప్రజా సమస్యలను గుర్తించి, అభివృద్ధి గురించి వివరించి ప్రజలకు పార్టీపై నమ్మకం కలిగేలా వ్యూహాత్మకంగా ముందుకెళ్లారు.
గొ‘గో’య్‌పై వ్యతిరేకత
వరుసగా నాలుగోసారి అధికారం చేజిక్కించుకోవాలన్న కాంగ్రెస్ ఆశలు గల్లంతయ్యాయి. ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ పార్టీ అభివృద్ధి కన్నా తన కుమారుడిని ప్రమోట్ చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపటం..ప్రభుత్వంపై పెరిగిన వ్యతిరేకత కాంగ్రెస్‌ను ఇబ్బందికర వాతావరణంలోకి నెట్టాయి. దీనికి తోడు రాష్ట్రంలో అవినీతి పెరిగిపోవటం, బంగ్లా చొరబాట్లు, అభివృద్ధి కుంటుపడటం, నిరుద్యోగం పెరిగిపోవటం వంటి అంశాల కారణంగా ప్రజలు గొగోయ్‌కు బైబై చెప్పారు.
ఎన్డీఏ పక్షాల దెబ్బతో కాంగ్రెస్ మంత్రులు కొందరికి ఓటమి తప్పలేదు. మంత్రులు గౌతమ్ రాయ్, ఎతువా ముండా, సిద్దిఖీ అహ్మద్, బిస్మితా గొగోయ్ తదితరులు దారుణంగా ఓడిపోయారు. అస్సాం ప్రభుత్వ ఏర్పాటులో కింగ్‌మేకర్ అవుతుందనుకున్న ఏఐయూడీఎఫ్ 13 స్థానాల్లో గెలుపొందగా.. ఆ పార్టీ చీఫ్ బద్రుద్దీన్ అజ్మల్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు.
బీజేపీ విజయంలో ‘తెలుగు’ కృషి
అస్సాంలో బీజేపీ విజయం సాధించటం వెనక తెలుగోడి సత్తా ప్రధాన పాత్ర పోషించింది. పార్టీ అస్సాం వ్యవహారాలు చూస్తున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్, బీజేపీ నేత, నెహ్రూ యువకేంద్ర వైస్ చైర్మన్ పేరాల చంద్రశేఖర్‌లిద్దరూ తెలుగువారే. పరివార్ సంస్థలకు పూర్తి సమయం కార్యకర్తలు (ఫుల్‌టైమర్లు)గా ఉన్నప్పటినుంచే వీరితోపాటు పలువురు తెలుగు ప్రచారక్‌లు అస్సాంలో ఆరెస్సెస్, బీజేపీ ఆలోచన విస్తృతికి తీవ్రంగా కృషి చేశారు.
దీనికి తోడు ఎన్నకలకు ఏడాది ముందునుంచే చేస్తున్న వ్యూహరచనలోనూ వీరిద్దరు క్రియాశీలకంగా వ్యవహరించారు. అయితే.. రెండున్నర దశాబ్దాలుగా ఇక్కడ పాగా వేసేందుకు ఆరెస్సెస్ చాలా పనిచేస్తోంది. చొరబాట్లను ప్రధాన అంశంగా మార్చుకుని ప్రజల్లో చైతన్యం తెచ్చింది. ఇందుకోసం అస్సాంలో పనిచేసిన ఆరెస్సెస్ ఫుల్‌టైమర్లలో చాలా మంది తెలుగువారున్నారు.
విద్యార్థి నేతగా వచ్చి..
అస్సాంలో తొలిసారిగా బీజేపీకి విజయాన్ని సాధించి పెట్టిన సోనోవాల్
బీజేపీకి పెద్దగా పట్టులేని ఈశాన్య రాష్ట్రాల్లో తొలిసారిగా ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న వ్యూహాత్మక నేత సర్బానంద్ సోనోవాల్. అస్సాం గణ పరిషత్ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సోనోవాల్.. ఐదేళ్ల కింద బీజేపీలో చేరి అనతి కాలంలోనే కేంద్ర మంత్రి అయ్యారు.
కేంద్ర మంత్రిగా ఉంటూనే ఇప్పుడు అస్సాం శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగి ఆ పార్టీకి తిరుగులేని విజయాన్ని సాధించిపెట్టారు. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్‌యూ)తో సోనోవాల్ రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఏఏఎస్‌యూకు 1992 నుంచి 1999 దాకా ఆయన అధ్యక్షుడిగా వ్యవహరించారు. దాదాపు ఇదే సమయంలో 1996 నుంచి 2000వ సంవత్సరం దాకా నార్త్ ఈస్ట్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ చైర్మన్‌గా పనిచేశారు.
2001లో అసోం గణ పరిషత్‌లో చేరి మొరాన్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. వివాదాస్పద అక్రమ వలసదారుల చట్టంపై పోరాటం చేపట్టి.. ప్రజల్లో పేరు పొందారు. అనంతరం ఆ చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది కూడా. 2004లో కాంగ్రెస్ కంచుకోటగా భావించే డిబ్రూగఢ్ లోక్‌సభ స్థానం నుంచి సోనోవాల్ ఎంపీగా విజయం సాధించారు. 2011లో పార్టీ నాయకత్వంతో విభేదాలు వచ్చి బీజేపీలో చేరారు. తర్వాతి ఏడాదే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో అస్సాంలో బీజేపీకి ఏడు సీట్లను సాధించి పెట్టారు. అక్కడ కాంగ్రెస్ కంచుకోటలుగా భావించే నియోజకవర్గాల్లో కూడా బీజేపీ గెలుపొందడంతో ప్రధాని మోదీకి సోనోవాల్ దగ్గరయ్యారు. కచారి గిరిజన తెగకు చెందిన ఆయన 1962, అక్టోబర్ 31న డిబ్రూగఢ్ జిల్లా మొలొక్‌గావ్‌లో జన్మించారు. జిబేశ్వర్, దినేశ్వరి ఆయన తల్లిదండ్రులు. బ్రహ్మచారి అయిన సోనోవాల్.. న్యాయశాస్త్రంలో పట్టభద్రుడు.
బీజేపీ ‘పంచ’తంత్రం
సీఎం అభ్యర్థిగా సోనోవాల్ పేరు ప్రకటన: కేంద్ర ప్రభుత్వంలో క్రీడలు, యువజన వవ్యవహారాల మంత్రిగా పనిచేస్తున్న సర్బానంద్ సోనోవాల్‌ను బీజేపీ తన సీఎం అభ్యర్థిగా ప్రకటించింది. స్థానికుడు, ప్రజాసమస్యలపై అవగాహనతోపాటు రాష్ట్ర యువతలో మంచిపేరున్న సోనోవాల్‌ను రంగంలోకి దించటం బీజేపీకి కలిసొచ్చింది.
ఏజీపీ, బీవోపీఎఫ్‌లతో పొత్తు: అస్సాంలోని కోక్రాఝార్, పక్కనున్న జిలాల్లో బలంగా ఉన్న బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీవోపీఎఫ్)తో పొత్తు విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. దీని మూలంగానే ఈ ప్రాంతాల్లో బీజేపీ దాదాపు సీట్లన్నీ గెలుచుకుంది. అటు అస్సాం గణపరిషత్‌తో 2009 పార్లమెంటు ఎన్నికలనుంచీ బీజేపీకి పొత్తు కొనసాగుతోంది.
చొరబాట్లు ఆపటం.. అభివృద్ధిపై దృష్టి: ఎన్నికలకు ఏడాది ముందే బీజేపీ ప్రణాళికలు రూపొందించింది. స్థానిక సమస్యలు తెలుసుకోవటంతో పాటు అభివృద్ధి మంత్రాన్ని ప్రజలకు అర్థమయ్యేలా కార్యకర్తలు వివరించాలనేది బీజేపీ వ్యూహం. దీనికి తోడు బంగ్లాదేశ్ సరిహద్దు గుండా చొరబాట్లు పెరగటం, కాంగ్రెస్‌కు మిత్రుడైన ఏఐడీయూఎఫ్ ఈ చొరబాట్లను సమర్థించటం అస్సాం ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారింది. దీనిపై మిగిలిన జనాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. అయితే, ఈ చొరబాట్లకు బ్రేక్ వేస్తామని హామీ ఇవ్వటం అస్సాం ప్రజలకు భరోసాఇచ్చింది.
మోదీ హవా: 2014 ఎన్నికల తర్వాత దేశంలో పెరుగుతున్న మోదీ హవా కూడా అస్సాం ఎన్నికల్లో బీజేపీకి కలిసొచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో 14 స్థానాల్లో ఏడింటిని గెలుచుకున్న బీజేపీ.. మోదీ సర్కారు చేస్తున్న పనులు.. సమీప భవిష్యత్తులో రానున్న మార్పులపై ప్రచారం చేసింది. దీనికి తోడు మోదీ సుడిగాలి పర్యటనలు కూడా కలిసొచ్చాయి.
గిరిజన హోదా, విద్యాసంస్థల ఏర్పాటు,యువతకు ఉపాధి: అస్సాంలో కొండల్లో నివసించే బోడోలకు, మైదాన ప్రాంతాల్లో ఉండే కర్బీ తెగ వారికి గిరిజన హోదా ఇస్తామని మోదీ ప్రకటించారు. వెంటనే దీనికి సంబంధించిన పనిని కూడా ప్రారంభించారు. ఢిల్లీ పోలీసు శాఖలో ఈశాన్య రాష్ట్రాల యువతకు ఉద్యోగాలుంటాయని ప్రకటించిన ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీచేశారు. కోక్రాఝార్‌లోని కేంద్రీయ సాంకేతిక సంస్థకు డీమ్డ్‌వర్సిటీ హోదా ఇస్తానని ప్రధాని ప్రకటించారు. సీల్దా-గౌహతి-కాంచన్‌జంగ ఎక్స్‌ప్రెస్ రైలును బారక్ లోయ వరకు పొడగిస్తామని తెలిపారు. ఇవన్నీ బీజేపీకి అదనంగా కలిసొచ్చిన అంశాలు.
అస్సాంలో గెలిచిన ప్రముఖులు
సర్బానంద్ సోనోవాల్ (బీజేపీ)
తరుణ్ గొగోయ్ (కాంగ్రెస్)
హిమంత్ బిస్వా శర్మ (బీజేపీ)
అతుల్ బోరా (ఏజీపీ)
కృపానాథ్ మల్లా (బీజేపీ)
ప్రఫుల్ల కుమార్ మహంత (ఏజీపీ)
ఓడిన ప్రముఖులు
పవన్‌సింగ్ (మాజీకేంద్ర మంత్రి-కాంగ్రెస్)
బద్రుద్దీన్ అజ్మల్ (ఏఐయూడీఎఫ్ చీఫ్)
రాహుల్ అవమానించారు.. బీజేపీ ఆహ్వానించింది
న్యూఢిల్లీ: అస్సాంలో బీజేపీ విజయంలో ఆ పార్టీ ఎన్నికల కమిటీ కన్వీనర్ హిమంత్ బిస్వా శర్మ పాత్ర కీలకం. 2011 వరకు కాంగ్రెస్, తరుణ్ గొగోయ్ విజయాల్లో కీలక వ్యూహకర్తగా, యువనాయకుడిగా పేరున్న హిమంత్ శర్మ.. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రవర్తన కారణంగా పార్టీనుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరారు. ఇది కూడా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి ఓ కారణమైంది.
అసలేం జరిగింది?: 2015లోనే అస్సాం ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు హిమంత్ శర్మ.. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ను కలిశారు. పార్టీకి గడ్డుకాలం ఉందని.. అయితే కొన్ని వ్యూహాలతో ముందుకెళ్తే నాలుగోసారీ అధికారంలోకి రావొచ్చని శర్మ సూచిం చారు. అయితే శర్మ మాట్లాడుతుండగానే.. రాహుల్ కుక్కపిల్లతో ఆడుకుంటూ చర్చను పట్టించుకోలేదు. సీరియస్ చర్చ జరుగుతుండగా తనను పట్టించుకోకుండా కుక్కపిల్లపైనే రాహుల్ శ్రద్ధ చూపించటం శర్మకు కోపం తెప్పించింది.
దీనికితోడు దేశ రాజకీయాల్లో సానుకూల మార్పు గురించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలతో ఆకర్షితులైన హిమంత్ శర్మ 2015 లో బీజేపీ కండువా కప్పుకున్నారు. అప్పటినుంచి కాంగ్రెస్‌ను, రాహుల్‌ను ఓడించటమే లక్ష్యంగా తన వ్యూహాలను బీజేపీ విజయానికి వినియోగించారు.
బీజేపీకి దేశవ్యాప్తంగా ప్రజల మద్దతు
♦ అస్సాంలో విజయమే దీనికి నిదర్శనం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: బీజేపీ సిద్ధాంతాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజల మద్దతు, ఆమోదం లభిస్తోందనడానికి అస్సాంలో తమ పార్టీ విజయమే నిదర్శనమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అస్సాంలో పార్టీ విజయంపై ఆయన ఆనందం వ్యక్తంచేశారు. పేదల అభ్యున్నతికోసం మరింత కష్టపడి పనిచేయడానికి ఈ విజయం స్ఫూర్తినిస్తుందన్నారు. ఈశాన్యంలో తమ పార్టీకి ఇది తొలి విజయమన్నారు.
దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రజల మద్దతు లభిస్తోందన్న అంశాన్ని ఈ విషయం స్పష్టంచేస్తోందన్నారు. గురువారం ఆయన పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలతో కొద్దిసేపు మాట్లాడారు. కశ్మీర్‌లో లభించిన విజయంతో అస్సాంలో గెలుపును పోలుస్తూ, ఆది అనేకమందిని విస్మయానికి గురిచేసిందని వ్యాఖ్యానించారు. తమకు విజయాన్ని అందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల ఫలితాలు, బీజేపీకి, ఎన్డీయేకు ప్రోత్సాహకరంగా ఉన్నాయన్నారు. పేద ప్రజల జీవితాల్లో మార్పుతేవాల్సిన అవసరం ఉందని ఆయన కార్యకర్తలకు సూచించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ఆయన బృందానికి, అయిదు రాష్ట్రాల్లో పార్టీ శాఖలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
విజేతలకు అభినందనలు
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఏఐఏడీఎంకే అధినేత్రి జయలలిత, తృణమూల్ నాయకురాలు మమతా బెనర్జీ, అస్సాంలో బీజేపీ సీఎం అభ్యర్థి సరబానంద సోనోవాల్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. కేరళలో విజయం సాధించినందుకు సీపీఎం నేత అచ్యుతానందన్‌కు కూడా అభినందనలు తెలిపారు.
ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పును స్వాగతిస్తున్నాం. కేరళ అభివృద్ధికి ఎల్‌డీఎఫ్ రూపొందించిన మేనిఫెస్టోను ప్రజలు ఆదరించారు. బెంగాల్‌లో మా పార్టీ వైఫల్యంపై విశ్లేషించుకుంటాం.
- సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి
బెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు బెడిసికొట్టింది లెఫ్ట్ కూటమికి పెద్ద దెబ్బ. కారణాలపై లోతుగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. కేరళలో విజయం అంచనాలకు మించింది.
-సీసీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం
మోదీకి చంద్రబాబు అభినందనలు
సాక్షి, విజయవాడ: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించిన నేతలకు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. అస్సాంలో అధికారాన్ని దక్కించుకుని ఇతర రాష్ట్రాల్లో ఓట్లశాతాన్ని పెంచుకుని ఫలితాలు సాధించినందుకు ప్రధానిమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు అభినందనలు తెలిపారు.
మోదీ పాలనపై ప్రజలిచ్చిన తీర్పు : అమిత్
సాక్షి, న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండేళ్ల పాలనపై ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావిస్తున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి గతంలో పెద్దగా బలం లేదని, ఈ ఎన్నికలతో బలమైన పునాది పడిందని వివరించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిననాడే మిషన్ 7 స్టేట్స్‌గా తాను చెప్పినట్టు గుర్తుచేశారు. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో బలోపేతంపై దృష్టిపెట్టినట్టు తెలిపారు.
దేశంలో మార్పుకు నాంది : రాం మాధవ్
గువాహటి: అస్సాంలో బీజేపీ విజయం దేశవ్యాప్తంగా మార్పుకు నాంది పలికిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ తెలిపారు. కొంతకాలంగా అస్సాం ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొందన్నారు. సరైన సమయంలో అస్సాం విజయం బీజేపీకి కలిసొచ్చే అంశమన్న రాం మాధవ్.. తమ పార్టీ ఇచ్చిన కాంగ్రెస్ ముక్త భారత్ నినాదానికి దేశవ్యాప్తంగా స్పందన కనిపిస్తోందన్నారు. 2014 ఎన్నికల్లో ఓటమి నుంచి పాఠాలు నేర్చుకొనటంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు.
మమత, జయలకు వైఎస్ జగన్ అభినందనలు
♦ అస్సాంలో విజయంపై ప్రధాని మోదీకి శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ బెంగాల్‌లో రెండోసారి ప్రజాభిమానాన్ని చూరగొని తిరుగులేని విజయం సాధించిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి, తమిళనాడులో రికార్డు సృష్టించిన ఏఐఏడీఎంకే చీఫ్ జయలలితకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగ న్‌మోహన్‌రెడ్డి గురువారం అభినందనలు తెలిపారు.
ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘మమతా దీదీ...మీ తిరుగులేని విజయానికి అభినంద నలు’, ‘పురచ్చితలైవీ.. మీ ఘనవిజయానికి శుభాకాంక్షలు..’ అని జగన్ వేర్వేరుగా ట్వీట్ చేశారు. కేరళలో విజయం సాధించిన ఎల్డీఎఫ్‌కు అభినందనలు తెలిపారు, ‘అస్సాంలో బీజేపీని భారీ గెలుపు సాధించే దిశగా సారథ్యం వహించిన ప్రధాని మోదీకి అభినందనలు’ అని జగన్ మరో ట్వీట్ చేశారు.